Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలలో 14 ఆరోగ్య కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలను కేంద్రమంత్రికి వివరించారు. సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలోని ప్రజలకు బోధకాలు, నులిపురుగుల వ్యాధి నివారణకు డీఈసీ, ఆల్బెండజోల్, హైపర్ మెట్టిన్ మెడిసిన్స్‌ను నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మెడిసిన్స్ పంపిణీకి 2,600 మంది సిబ్బందికి శిక్షణను ఇచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశామని మంత్రి తెలిపారు. అలాగే 2522 మంది డ్రగ్ అడ్మినిస్ట్రేటర్లు క్షేత్రస్థాయిలో సేవలందిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఫైలేరియా, నులిపురుగుల నివారణకు చేపడుతున్న చర్యలపై రూపొందించిన అవగాహన కరపత్రాలను, బ్రోచర్లను ఆవిష్కరించారు.
ఇవి కూడా చదవండి..
MLA Sanjay | గురుకుల విద్యార్థుల మరణాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే : ఎమ్మెల్యే సంజయ్
TGSRTC | మహిళలకు శుభవార్త.. ఆర్టీసీ కార్గోలో రాఖీలు.. 24 గంటల్లో చేరేలా చర్యలు