హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయలేదంటూ నలుగురు పోలీసు అధికారులకు నాలుగు వారాల సాధారణ జైలు శిక్ష, రూ. 2 వేలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే నిమిత్తం శిక్ష అమలును ఆరు వారాలపాటు నిలిపివేసింది. బీహార్ వర్సెస్ అర్నేష్ కుమార్ కేసులో ఏదైనా కేసులో నిందితులకు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ నోటీసు జారీ చేయాలని, భార్యభర్తల వివాదంలో నిందితులైన భర్త, అత్తలకు నోటీసు జారీ చేయకపోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని చెప్పింది.
హైదరాబాద్ సిటీ పోలీస్ జాయింట్ కమిషనర్ (అప్పుడు వెస్ట్‌జోన్ డీసీపీ) ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ ఎం. సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ సీహెచ్ నరేశ్‌కు జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ రాధారాణి తీర్పు చెప్పారు. జక్కా వినోద్‌కుమార్‌రెడ్డి, ఆయన తల్లి సౌజన్యారెడ్డి దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసును అనుమతించింది. తాము హైకోర్టులో కేసు వేస్తే పోలీసులు కౌంటర్ దాఖలు చేశారని, ఇదే పోలీసులు కింది కోర్టులో తాము పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారని పిటిషనర్ల వాదన. పోలీసులకు వినతిపత్రాలు ఇచ్చామని, మెయిల్స్ చేశామని, దీనిపై పోలీసులు స్పందించలేదని సుప్రీంకోర్టు న్యాయవాది దిల్జిత్ సింగ్ అహ్లువాలియా చెప్పారు. ఇవన్నీ కోర్టు ధిక్కార చర్యలే అవుతాయని హైకోర్టు పైవిధంగా తీర్పు వెలువరించింది.