Sigachi blast case : సిగాచి ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తంచేసింది. గత ఏడాది సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించిన ఘటనలో 56 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇంకో 28 మంది క్షతగాత్రులయ్యారు.
ఆ మరణించిన 56 మందికి, ఆచూకీ లభించని 8 మందికి, 28 మంది క్షతగాత్రులకు పరిహారం అందించాలని, ప్రమాదంపై దర్యాప్తు కోసం SIT ఏర్పాటు చేయాలని బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరుపుతూ.. ‘పరిహారం ఎంత ఇస్తామని చెప్పారు..? ఎంత ఇస్తున్నారు..? ఎప్పుడు ఇస్తారు..?’ అంటూ న్యాయమూర్తి ఒకింత ఆగ్రహంతో ప్రశ్నించారు.
పరిహారం పంపిణీకి సంబంధించిన అంశాలపై కంపెనీ వివరణ ఇవ్వాలని, దానికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ ప్రకటించిన పరిహారంతోపాటు, చట్టప్రకారం అందాల్సిన పరిహారం వివరాలను సమర్పించాలని ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండళ్లను సుమోటో ప్రతివాదులుగా చేర్చి హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నోటీసులు ఇచ్చారు.