హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్టున్నదని హైకోర్టు అభిప్రాయపడింది. ఒకే ఘటన మీద మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎందులోనూ నరేందర్‌రెడ్డి పేరు లేకపోవడం, సంఘటన జరిగినప్పుడు ఆయన భౌతికంగా ఉన్నాడనో, స్వయంగా దాడులకు పాల్పడాడనో ఫిర్యాదుల్లో పేర్కొనలేదని గుర్తుచేసింది.
కేవలం కుట్రపన్నారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయడాన్ని పరిశీలిస్తే నరేందర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నట్టుగా ఉన్నదని వ్యాఖ్యానించింది. ఒకే ప్రదేశంలో, ఒకే సమయంలో జరిగిన ఒకే ఘటనకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. రెండు ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ శుక్రవారం జస్టిస్ కే లక్ష్మణ్ తీర్పు వెలువరించారు.
బొమ్రారాస్పేట పోలీస్‌స్టేషన్‌లో తనపై మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ పట్నం నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కే లక్ష్మణ్ తీర్పును వెలువరించారు. ఒకే చోట, ఒకే సమయంలో ఏదైనా సంఘటన జరిగితే వేర్వేరు కేసులను ఎలా నమోదు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు. ‘ఒక ఘటనపై ఒక ఎఫ్ఐఆర్ను మాత్రమే నమోదు చేయాలి. ఒకవేళ తొలి ఎఫ్ఐఆర్లో తప్పులు, పొరపాట్లు ఉంటే ఆ లోపాలను సరిదిద్దేందుకు, కొత్త విషయాలు ఉంటేనే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వీలుంటుంది. అవే ఆరోపణలతో మళ్లీమళ్లీ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం చట్ట వ్యతిరేకం’ అని స్పష్టం చేశారు.
బీఎన్ఎస్ఎస్ చట్ట నిబంధనల ప్రకారం, టీటీ అంటోనీ వర్సెస్ కేరళ రాష్ట్రం మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒకే ఘటనపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. వికారాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు బొమ్రాస్పేట పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ 153/2024 మాత్రమే చెల్లుతుందని చెప్పారు. దుద్యాల ఎమ్మార్యో కర్ర కిషన్, వికారాబాద్ డీఎస్పీ బీ జానయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎఫ్ఐఆర్లు 154, 155 చెల్లవని చెప్పారు.
మూడు ఫిర్యాదులలో ఏ ఒక దానిలోనూ పట్నం నరేందర్‌రెడ్డి పేరు లేదని ధర్మాసనం పేర్కొన్నది. ఆయన భౌతికంగా ఘటనాస్థలంలో ఉన్నట్టుగానీ, స్వయంగా దాడులకు పాల్పడినట్లుగానీ ఫిర్యాదుల్లో లేదని తెలిపింది. మూడు నేరాల్లో నిందితులపై మోపిన ఆరోపణలు వేర్వేరుగా ఉన్నాయనే ప్రభుత్వ వాదన చట్ట వ్యతిరేకమని పేర్కొంది. ఘటన జరిగిన ప్రదేశం ఒకటే అయినా బాధితులు, నిందితులు వేర్వేరని, నేరాలు కూడా భిన్నంగా ఉన్నాయని, ఈ కేసుల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని, పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని ప్రభుత్వం చేసిన వాదనను తోసిపుచ్చింది. అధికారులు స్వ యంగా ఫిర్యాదును ఎందుకు రాసివ్వలేదన్న ప్రశ్నకు అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) ఇచ్చిన వివరణను హైకో ర్టు తప్పుబట్టింది. ‘ఫిర్యాదు చేసిన ఎ మ్మార్వో, డీసీఆర్బీ, డీఎస్పీ ఉన్నత స్థా యిలో ఉన్న బాధ్యత గల అధికారులు.
ఉన్నత చదువులు చదివినవారు. వాళ్లు స్వయంగా ఫిర్యాదులు రాసి ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్లో రైటర్ రాసిన ఫిర్యాదులపై ఇద్దరు అధికారులు సంతకాలు చేశారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ చేసిన వాదన ఆమోదయోగ్యంగా లేదు. కలెక్టరపై దాడి సంఘటనతో ఇద్దరు అధికారులు షాక్‌కు గురై ఫిర్యాదును రాసే పరిస్థితిలో లేరని ఏఏజీ చెప్పడం సబబు కాదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
‘కేసు పూర్వపరాలను, ఫిర్యాదుల్లోని విషయాలను, వా స్తవాలను పరిశీలిస్తే పట్నం నరేందర్‌రెడ్డిని కేసులో ఇరికించాలని చూస్తున్నట్టు గా ఉన్నది’ అని వ్యాఖ్యానించారు. కాబట్టి రెండు ఫిర్యాదులను (154, 155)లను కొట్టివేస్తున్నామని తీర్పునిచ్చారు. దుద్యాల తాసిల్దార్, వికారాబాద్ డీఎస్పీ వాంగ్మూలాలను దర్యాప్తు అధికారి రికార్డు చేయవచ్చని, వాంగ్మూలాలను రికార్డు చేస్తే వా టిని ఎఫ్ఐఆర్ 153/2024లో భాగం గా పరిగణించాలని స్పష్టం చేశారు.