హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పేరొంటూ హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆహారంలో విషం కలిపి మట్టుబెట్టారని పిటిషన్లో పేరొన్నారు. విషాహారం భుజించిన మావోయిస్టులను పోలీసులు పట్టుకొని చిత్రహింసలకు గురిచేశారని, ఆ తర్వాత ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని ఆరోపించారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన మల్లయ్య భార్య కే ఐలమ్మ అలియాస్ మీనా దాఖలుచేసిన ఈ పిటిషన్‌ను హైకోర్టు సోమవారం విచారణకు చేపట్టింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈలోగా ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఏటూరునాగారం పీహెచ్సీలో భద్రపర్చాలని పోలీసులను ఆదేశించింది. మృతదేహాలను చూసేందుకు పిటిషనర్‌ను, మృతుల రక్తసంబంధీకులను అనుమతించాలని ఏటూరునాగారం ఎస్‌హెచ్‌వోకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ వ్యవహారంపై మంగళవారం సమగ్ర విచారణ చేపడతామని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి తెలిపారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది డీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న పిటిషనర్ మీనా పోలీసులకు ఈ-మెయిల్ పంపారని, తన భర్త మృతదేహానికి తన సమక్షంలో ఇంక్వెస్ట్ (సంఘటన స్థలంలో వాస్తవాల పరిశీలన) చేసి పోస్టుమార్టం నిర్వహించాలని కోరారని వివరించారు. దీనిని ములుగు పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 196 (5)ను పోలీసులు ఉల్లంఘించారని తెలిపారు. మృతుల కుటుంబంలో ఎవరికైనా ఇంక్వెస్ట్ బృందంలో భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. నక్సల్స్ తినే ఆహారంలో పోలీసులు విషం, మత్తుమందులు కలిపారని, ఆ తర్వాత వారు సృ్పహతప్పి పడిపోయారని వివరించారు. అప్పుడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని హత్య చేశారని చెప్పారు. విషాహారం కూడా పోలీసులే మావోయిస్టులకు చేరేలా చేశారని అన్నారు. మృతుల్లో ఒకరి చేతిపై యాసిడ్‌తో కాలినగాయాలు ఉన్నాయని, దుస్తులపై తెల్లటి పొడి ఉన్నదని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగినప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గుర్తుచేశారు. ఇకడ కేసు దర్యాప్తునకు మావోయిస్టుల మృతదేహాలు ఎంతో కీలకమని చెప్పారు. పోలీసులు హడావుడిగా రాత్రికి రాత్రే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలకు దహనసంసారాలు పూర్తిచేయాలని చూస్తున్నారని తెలిపారు. ఎన్‌కౌంటరే నిజమైతే.. పోలీసులు హడావుడిగా పోస్టుమార్టం ఎందుకు చేయించారని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ సైన్స్ వెద్య నిపుణులు ఉన్న వరంగల్‌లోని ఎంజీఎంకు మృతదేహాలను తరలించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరారు. మృదేహాలకు బంధువుల సమక్షంలో ఇంక్వెస్ట్ జరిగేలా ఉత్తర్వులు ఇవ్వాలని, మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి ఎఫ్ఎస్ఎల్ నిపుణులతో కూడిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
పిటిషనర్ వాదనలతో ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌రాజ్ విభేదించారు. నిబంధనల ప్రకారమే వైద్య నిపుణుల బృందం పోస్టుమార్టం చేసిందని అన్నారు. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం సమయంలో పిటిషనర్ కూడా ఉన్నారని, భర్త మృతదేహాన్ని చూడటానికి పిటిషనర్‌ను అనుమతిచ్చారని తెలిపారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించడం సాధ్యం కాదని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించాలని ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. అయితే, మృతదేహాలను భద్రపర్చాలని ఏటూరునాగారం పోలీసులను ఆదేశించింది. రాతపూర్వకంగా ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తి తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
అది ఎన్కౌంటర్ కాదు. పట్టుకుని చిత్రహింసలు చేసి చంపారు. ముందు నుంచి మాత్రమే నా భర్త శవాన్ని చూపించారు. ఫొటో కూడా తీయనియ్యలేదు. తల బొక్కలు పూర్తిగా అతికి లేదు. ముక్కలు ముక్కలై ఉన్నాయి. వెనుక వైపు శరీరాన్ని చూపించలేదు. కుటుంబ సభ్యులందరికీ మృతదేహాన్ని చూపించాలి. మా ముందే పోస్టుమార్టం చేయించాలని హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. దీన్ని అమలు చేయాలి. ఫొటో అడిగినందుకు ఇబ్బంది పెట్టారు. అన్నంలో విషంపెట్టి చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. కాళ్లు చేతులు విరగొట్టారు. చేయి కూడా వెనుకకు తిరిగి ఉంది. ఒక మృతదేహంపై కెమికల్ చల్లి నల్లగా అయ్యేట్లు చేశారు. ఇది బూటకపు ఎన్కౌంటర్.
ఏటూరునాగారం, డిసెంబర్ 2: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక ఎన్కౌంటర్ మృతదేహాలకు స్థానిక సామాజిక వైద్యశాలలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వీడియో, ఫొటోగ్రఫీ మధ్య వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. మృతిచెందిన మావోయిస్టుల కుటుంబ సభ్యులు, బంధువులు ఏటూరునాగారంలోని సామాజిక వైద్యశాలకు చేరుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు మావోయిస్టుల కుటుంబ సభ్యులను పోలీసులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. రాత్రి వరకు పోస్టుమార్టం కొనసాగడంతో కుటుంబ సభ్యులంతా అక్కడే వేచి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరికి చెందిన ఏగోలపు మల్లయ్య భార్య మీనా, సోదరుడు రాజయ్యతోపాటు బంధువులు అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడారు.