హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో మూడో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ ఎన్ భుజంగరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 18 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చికిత్స నిమిత్తం మంజూరైన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు గురువారంతో ముగిశాయి.
దానిని పొడిగించాలన్న వినతిని నాంపల్లి కోర్టు తిరసరించిం ది. గురువారం సాయంత్రం 4 గంటల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యం లో భుజంగరావు హైకోర్టులో అత్యవసర లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని ఆమోదిస్తూ జస్టిస్ కే సుజన మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. భుజంగరావు ఆరోగ్యం సరిగాలేదని, ఇటీవల శస్త్రచికిత్సలు చేసుకున్నారని, తిరిగి జైలుకు పంపితే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో ఈనెల 18వ తేదీ సాయంత్రం 4.30 దాకా భుజంగరావు మధ్యంతర బెయిలును హైకోర్టు పొడిగించింది.