హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు శాసనసభా వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా, ఓటింగ్‌లో పాల్గొనకుండా ఉత్తర్వులు జారీ చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనర్హత వేటు వేయాలనే పిటిషన్లు స్పీకర్ ఎదుట విచారణలో ఉన్నాయని, తగిన సమయంలోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను పూర్తి చేయాలని తాము ఇటీవల ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేసింది.
ఈ నేపథ్యంలో పిటిషనర్ అభ్యర్థనను ఆమోదించలేమని తేల్చి చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, ఎం సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేఏ పాల్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
వ్యక్తిగత హోదాలో పిల్ దాఖలు చేసిన పాల్ వాదనలు వినిపిస్తూ, దానం నాగేందర్‌కు ఫిరాయింపులకు పాల్పడటం వెన్నతో పెట్టిన విద్యలా మారిందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి చేరడమే కాకుండా సికింద్రాబాద్ లోక్‌సభ సీటుకు కాంగ్రెస్ తరఫున పోటీ చేశారని వివరించారు.
ఇలాంటి ఎమ్మెల్యేలను కొనసాగించేందుకు వీల్లేదని, ప్రజాతీర్పును కాలరాశారని పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. స్పీకర్ చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుంటే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే ఉంటుందని ఈ పరిస్థితుల్లో హైకోర్టు జోక్యం చేసుకుని ప్రజాతీర్పు కాలరాసే వాళ్లను అడ్డుకోవాలని కోరారు.