హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : పెండ్లికాని ఓ బాలిక 28 వారాల గర్భాన్ని తొలగించేందుకు ఉత్తర్వులు జారీచేయాలంటూ ఆమె తల్లి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఆ బాలిక 7 నెలల గర్భవతి అని, గర్భస్రావం చేస్తే ఆమె ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని వైద్య నివేదికలు హెచ్చరిస్తున్నాయని స్పష్టం చేసింది.
ప్రసవించే వరకు ఆ బాలికను డిశ్చార్జి చేయకుండా వైద్య సేవలు అందించాలని, ఆమె ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షించాలని నిలోఫర్ దవాఖానను ఆదేశించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖతోపాటు పోలీసు శాఖ సమన్వయంతో సఖి కేంద్రం సహాయం పొందాలని ఆమె తల్లికి సూచించింది. ఈ మేరకు జస్టిస్ భీమపాక నగేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేశారు.