హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను జూన్ 5కు వాయిదా వేస్తున్నట్టు శుక్రవారం తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. శనివారం నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణకు ఆసారం లేదని జస్టిస్ కే సురేందర్ స్పష్టం చేశారు.
అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న వినతిని కూడా తోసిపుచ్చారు. దీంతో అవినాశ్ తరఫు న్యాయవాది ఈ విషయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ అంశాన్ని వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్ ఎదుట ప్రస్తావించాలని సీజే స్పష్టం చేశారు.