న్యూఢిల్లీ/హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ యూజీ-2022 ఫలితాలు బుధవారం రాత్రి విడుదలయ్యాయి. రాజస్థాన్‌కు చెందిన తనిష్క మొదటి ర్యాంక్ సాధించగా.. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్ బాత్రా రెండో ర్యాంకు సాధించాడు. కర్ణాటకకు చెందిన హృషికేశ్ నాగభూషణ్ గంగూలీ, రుచా పవోషీ వరుసగా మూడు, నాలుగు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులూ సమానంగా 99 పర్సెంటైల్ సాధించారు. ఈ ఏడాది 18.72 లక్షల మంది నీట్‌కు దరఖాస్తు చేసుకోగా, 9.93 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అఖిల భారత ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటారు.
హైదరాబాద్‌కు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థ్రావు 720 మార్కులకుగాను 711 మార్కులు సాధించి ఆలిండియా ఐదో ర్యాంకు సాధించాడు. తెలంగాణ నుంచి 61,207 మంది అభ్యర్థులకుగాను, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. వీరిలో 35,148 మంది అర్హత సాధించారు. చప్పిడి లక్ష్మీచరిత 705 మార్కులు పొంది ఆలిండియా 37 ర్యాంకు సాధించింది. అలాగే కే జీవన్‌కుమార్‌రెడ్డి 705 మార్కులు పొంది ఆలిండియా 41 ర్యాంకు సాధించాడు. వీ అతిథి 700 మార్కులు పొంది 50వ ర్యాంకు కైవసం చేసుకున్నది. సీహెచ్ యశస్విని 700 మార్కులు పొంది ఆలిండియా 52వ ర్యాంకు సాధించింది. ఫిమేల్ టాప్ 20 ర్యాంకుల్లో లక్ష్మీచరిత, అతిథి చోటుదక్కించుకున్నారు. ఎస్టీ కోటాలో ఎం లితేశ్చౌహాన్ 668 మార్కులు పొంది ఆలిండియా 400 ర్యాంకు సాధించాడు. ఆలిండియా ఐదో ర్యాంకు సాధించిన ఎర్రబెల్లి సిద్ధార్థ్రావు స్వగ్రామం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సురారం గ్రామం. వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఎంబీబీఎస్ తర్వాత కార్డియాలజిస్ట్ కావాలనేది తన కోరక అని సిద్ధార్థ్రావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపాడు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని పేర్కొన్నాడు.
ఆలిండియా కోటా తర్వాతే..
ముందుగా ఆలిండియా కోటా సీట్లను భర్తీచేస్తారు. ఈ కోటాలో రాష్ట్రం నుంచి 15 శాతం సీట్లు భర్తీచేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర కోటా సీట్లను భర్తీచేస్తారు. విద్యార్థులు ఆలిండియా కోటా, స్టేట్ కోటాకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆలిండియా కోటా కోసం విద్యార్థులు www.mcc. nic. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. నీట్ కటాఫ్ మార్కులు తగ్గాయి. 720 మార్కులకుగాను జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు గత ఏడాది 138 మార్కులు వస్తే కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించగా, మిగిలిన క్యాటగిరి 108 మార్కులు కటాఫ్‌గా నిర్ధారించారు. 2020లో జనరల్ క్యాటగిరి కటాఫ్ 147 మార్కులు, మిగిలిన క్యాటగిరిలో 113 మార్కులకు కటాఫ్ అయ్యింది.
రాత్రిపూట విడుదల..
పరీక్షలు, ఫలితాల విషయంలో విద్యార్థులకు చుక్కలు చూపెడుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ ఫలితాల్లోనే అదే పునరావృతం చేసింది. నీట్ (యూజీ) ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ గతంలోనే ప్రకటించింది. ఉదయం నుంచి వి ద్యార్థులు ఫలితాల కోసం వెచిచూశారు. ఎట్ట కేలకు రాత్రి 10:30 గంటల తర్వాత ఎన్టీఏ వర్గాలు ఫలితాలను విడుదల చేశాయి.