హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ‘టెలిమానస్’ సేవలకు తెలంగాణకు జాతీయస్థాయి అవార్డు దక్కింది. నిరుడు అత్యుత్తమ సేవలు అందించిన రాష్ర్టాలను గుర్తించిన కేంద్ర వైద్యారోగ్య శాఖ అవార్డులు అందజేసింది. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఢిల్లీలో ‘నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. చిన్నరాష్ర్టాల క్యాటగిరీలో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్రం అభినందించింది. ఒకే టెలిమానస్ కాల్‌సెంటర్ ఉన్న రాష్ర్టాలను కేంద్రం చిన్నరాష్ర్టాల క్యాటగిరీలో ఉంచింది.
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టెలిమానస్ కేంద్రాన్ని నిరుడు అక్టోబర్ 11న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కేంద్రం కోసం 14416 టోల్ ఫ్రీ నంబర్‌ను కేటాయించారు. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనల వంటి మానసిక ఇబ్బందులు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్ చేస్తే నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 24 గంటలపాటు ఈ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. ఈ కేంద్రంలో ప్రస్తుతం 20 మంది కౌన్సిలర్లు, ఐదుగురు స్పెషలిస్టులు (ముగ్గురు సైకాలజిస్ట్స్లు, ఇద్దరు సైకియాట్రిస్ట్‌లు) అందుబాటులో ఉన్నారు. కౌన్సిలర్లకు బెంగళూరులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి కౌన్సిలర్లు ప్రాథమికంగా కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే ప్రత్యేక వైద్యులకు రెఫర్ చేస్తారు.
నిరుడు అక్టోబర్ 11 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 11 నాటికి టెలిమానస్ కేంద్రానికి మొత్తం 34,522 మంది బాధితులు ఫోన్ చేశారు. వీరికి కౌన్సిలర్లు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో 2,031 మందిని స్పెషలిస్టులకు రెఫర్ చేశారు. మానసిక చికిత్స అవసరమైన వారిని సమీపంలోని మానసిక చికిత్స కేంద్రానికి రెఫర్ చేశారు. టెలిమానస్ సేవలు పొందినవారిలో మహిళలే ఎక్కువగా ఉండటం గమనార్హం.