హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ సత్తా చాటింది. రాష్ర్టానికి చెందిన 15 మంది విద్యార్థులు 300కు 300 మార్కులు సాధించారు. దేశవ్యాప్తంగా 56 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్‌ను సొంత చేసుకోగా, వీరిలో 15 మంది (26%) టాపర్లు తెలంగాణకు చెందినవారే ఉన్నారు. 100 పర్సంటైల్ పొందిన వారిలో అత్యధికులు ఐదు రాష్ట్రాల నుంచే ఉన్నారు. మన రాష్ట్రం తర్వాత ఏపీ, మహారాష్ట్ర నుంచి ఏడుగురుచొప్పున 100 పర్సంటైల్ సొంతం చేసుకొన్నారు.
రాష్ర్టానికి చెందిన హుండేకర్ విధిత్, ముత్తవరపు అనూప్, వెంకటసాయితేజ మదినేని, రెడ్డి అనిల్, రోహన్‌సాయి పబ్బా, శ్రీ యశాష్ మెహన్, కల్లూరి, కేసం చెన్నబసవారెడ్డి, మురికినాటి సాయిదివ్యతేజారెడ్డి, రిషి శేఖర్‌శుక్లా, తవ్వ దినేశ్‌రెడ్డి, గంగా శ్రేయాష్, పొలిశెట్టి రితిశ్ బాలాజీ, తమటం జయదేవ్‌రెడ్డి, మావూరు జస్విత్, డీ శ్రీనివాస్‌రెడ్డి 300లకు 300 మార్కులు సాధించారు. క్యాటగిరీ ర్యాంకుల్లోనూ ఆలిండియా టాపర్లుగా నిలిచారు. ఆలిండియా ఎస్టీ టాపర్‌గా రాష్ర్టానికి చెందిన జగన్నాధం మెహిత్ సత్తాచాటారు.