హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణకు హరిత హారం’.. రాష్ట్రంలో ఈ కార్యక్రమం పేరు తెలియనివారు ఉండరు. ఈ పథకం ప్రారంభమై పదేండ్లు పూర్తయ్యాయి. ఒక ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే ఆకాశాన్ని తాకే సౌధాలు, భారీ నిర్మాణాలు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు నెలకొల్పడం మాత్రమే కాదు.. ప్రజలు ఆరోగ్యంగా బతికేలా, పశుపక్షాదులకు ఆవాసం కల్పించి, జీవవైవిధ్యాన్ని కాపాడాలి. ఇందుకు తగిన మోతాదులో పచ్చదనం ఉండాలి. కాంక్రీట్ జంగల్‌ను, అటవీ విస్తీర్ణాన్ని సమతుల్యం చేయగలగాలి. పచ్చదనాన్ని పెంపొందించడం అంత సులభం కాదు, చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉంటేనే సాధ్యం అవుతుంది.
తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన ‘తెలంగాణకు హరిత హారం’తో ఇది సాకారం అయ్యింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణను ఆవిష్కరించాలనే లక్ష్యంతో కేసీఆర్ ఈ బృహత్ పథకానికి శ్రీకారం చుట్టారు. 2015 జూలై 3న తొలి మొక్క నాటి హరిత యజ్ఞాన్ని ప్రారంభించారు. కేసీఆర్ మానస పుత్రిక వంటి ఈ పథకం తెలంగాణను ఆకుపచ్చగా మార్చింది. రాష్ట్రంలో అటవీ శాతాన్ని పెంచి తెలంగాణ ప్రజల ఆయుర్ధాయాన్ని, ఆరోగ్యాన్ని పెంచింది. ఈ విషయాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థలే స్వయంగా వెల్లడించాయి. ఈ పథకం నీతిఆయోగ్, ఐక్యరాజ్యసమితి వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందడమే కాకుండా, అనేక అవార్డులను దక్కించుకున్నది.
రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఏటా వానకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది విడతల్లో 290.35 కోట్ల మొక్కలను నాటారు. 2015-16లో తొలిఏడాది 15.86 కోట్ల మొక్కలు నాటడంతో మొదలైన ప్రస్థానం.. 2017-18లో రికార్డు స్థాయిలో ఏకంగా 60.05 కోట్ల మొక్కలు నాటే స్థాయికి ఎదిగింది. ఏటా సగటున 30-40 కోట్ల మొక్కలను నాటారు.
ఇందుకోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. తొమ్మిది విడతల హరితహారం కోసం రూ.10,822 కోట్లు ఖర్చు చేసింది. అవసరమైన మొక్కలను పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 14,864 నర్సరీలను ఏర్పాటు చేయించింది. ఈ పథకం కేవలం రోడ్ల పక్కన, అక్కడక్కడ చెట్లు పెంచడానికే పరిమితం కాలేదు. పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేకంగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేయించింది. ఈ విధంగా 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలను, 6298 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలను, 1,00,691 కిలో మీటర్ల మేర రహదారి వనాలను, 12వేల కిలోమీటర్ల మేర బహుళ రహదారి వనాలను అభివృద్ధి చేసింది.
హరితహారం పథకం ద్వారా తెలంగాణ రాష్ర్టాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న సీఎం కేసీఆర్ ‘హరిత స్వప్నం’ అనతికాలంలోనే నెరవేరింది. ఈ పథకం రాష్ర్టానికి ఆకుపచ్చ తోరణం తొడిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85 శాతం పెరిగింది. పచ్చదనం 7.7 శాతం పెరిగింది. చెట్ల సంఖ్య 14.51 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015లో తెలంగాణలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 2019-21 మధ్య అటవీ విస్తీర్ణం పెరుగుదలలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ సమయంలో దేశంలో 0.22 శాతం(1540 చదరపు కిలోమీటర్లు) పెరిగితే, తెలంగాణలో 3.07శాతం(632 చదరపు కిలోమీటర్లు) పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది.
హరితహారంలో భాగంగా హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున పచ్చదనం పెంపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. హైదరాబాద్‌లో పచ్చదనం 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే 246శాతం పెరుగుదల నమోదైంది. పచ్చదనం పెంపుపై హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్‌సిటీ అవార్డు దక్కింది. దీంతోపాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అవార్డును సైతం దక్కించుకున్నది. దేశంలో ఒక్క హైదరాబాద్ మాత్రమే ఈ అవార్డును అందుకోవడం గమనార్హం.
హరితహారం పథకానికి నిధులు సమస్య రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దేశంలో మరెక్కడా లేనివిధంగా 10 శాతం గ్రీన్ బడ్జెట్‌ను అమలు చేశారు. ఇందులో భాగంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పచ్చదనం పెంపుకోసం 10శాతం నిధులను కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. నాడు 10శాతం గ్రీన్ బడ్జెట్ ప్రకటన పెద్ద సంచలనంగా మారింది. దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పాటు హరితహారం అమలు తీరుపైనా ఆయన ప్రత్యేక శ్రద్ద పెట్టారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలని నిబంధన పెట్టారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులను బాధ్యుతలను చేస్తూ విధుల నుంచి తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. భావి తరాలు కాంక్రీట్ జంగల్లో బంధీలు కాకుండా, రాష్ట్ర పచ్చదనాన్ని పెంచాలనే కేసీఆర్ ఆలోచన ఎంత బలమైందో ఈ ఉదాహరణ చెబుతుంది.
భావి తరాల కోసం పరితపించిన కేసీఆర్ ఆశయాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పథకాన్ని క్రమంగా కనుమరుగు చేసే కుట్రకు తెరలేపింది. మొదట హరితహారం పేరును వనమహోత్సవంగా మార్చింది. కార్యక్రమం ప్రారంభోత్సవం పేరుతో కొంత హడావుడి చేసినా, పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చేతులేత్తేసింది. ఈ పథకానికి కాగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో పైసా కేటాయించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో తెప్పించిన మొక్కలు అందుబాటులో ఉన్నా, నర్సరీల్లో మొక్కలు పెరిగినా, వాటిని నాటేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని తెలుస్తున్నది. దీంతో గతంలో పండుగలా సాగిన ఈ పథకం, ఇప్పుడు నీరుగారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ ప్రారంభించిన హరితహారం పథకం దేశవ్యాప్తంగా చేపట్టిన అటవీకరణ డ్రైవ్‌లలో అతిపెద్దదిగా నిలిచి, తెలంగాణను వికసింపజేసిందని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బంజరు భూముల నుంచి హరిత కారిడార్ల వరకు, సమాజ ఆధారిత తోటల నుంచి పర్యావరణ అవగాహన దాకా హరితహారం స్థిరమైన పాలనను పునర్నిర్వచించిందని పేర్కొన్నారు. పర్యావరణ వ్యవస్థలను పునరుజ్జీవింపజేసిందని, వర్షాన్ని మెరుగుపరిచిందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. దశాబ్దం నిర్విఘ్నంగా కొనసాగిన హరితహారం పురోగతిని మరో దశాబ్దాం పాటు కొనసాగిద్దామన్నారు. తెలంగాణ పర్యావరణ నిర్వహణ వారసత్వాన్ని పెంపొందిచేందుకు ప్రతిఒక్కరం ప్రతిజ్ఞ చేద్దామని సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో చేపట్టిన హరితహారం అద్భుతమైన పథకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 24 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణం పదేండ్లలో 33 శాతానికి పెరగడమే ఇందుకు సజీవ సాక్ష్యమన్నారు. హరితహారం ప్రారంభమై పదేండ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ గురువారం ఎక్స్ వేదికగా ఈ పథకం తెచ్చిన గొప్ప పర్యావరణ మార్పులను వివరించారు. ఒక్క చిన్న మొక్క నిశ్శబ్దంగా మొత్తం అడవికి జన్మనిచ్చినట్టు.. కేసీఆర్ మదిలో మెదిలిన ఒక్క చిన్న ‘హరిత’ ఆలోచన తెలంగాణను పచ్చని స్వర్గధామంగా మార్చిందన్నారు. హరిత ప్రేమికుడి చొరవతోనే 12,472 పంచాయతీలు, 143 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85 శాతం, చెట్ల విస్తీర్ణం 14.51 శాతం, పచ్చదనం 7.7 శాతం పెరిగిందని తెలిపారు.