సుబేదారి, జూన్ 28 : ఓ మహిళ పట్ల మరో మహిళ పాశవికంగా ప్రవర్తించింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నదనే ఆగ్రహంతో సదరు మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తరించి, జననాంగంలో జీడి పోసిన అమానవీయ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయలలో ఆరు రోజుల క్రితం జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటికాయలకు చెందిన గంగకు ములుగు జిల్లా బొల్లోనిపల్లికి చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రాజు తన బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు వదిలిపెట్టిపోయాడు.
గంగ సదరు విషయం తెలుసుకొని పిల్లలతో తాటికాయలకు వచ్చి భర్త విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. గంగ కుటుంబ సభ్యులు వారిద్దరినీ ఐదు రోజుల క్రితం వెతికి తాటికాయలకు తీసుకొచ్చారు. రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఇంటి ముందు చెట్టుకు కట్టేశారు. వివస్త్రను చేసి.. గుండు గీసి, మర్మాంగాల్లో జీడి పోశారు. ‘నేను తప్పు చేశాను క్షమించండి’ అని ఆ మహిళ వేడుకున్నా వినకుండా చెప్పులతో దాడిచేశారు. రాజుకు కూడా గుండు గీయించారు. ఈ అమానుష ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ దారుణ ఘటనను పోలీసు అధికారులు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ధర్మసాగర్, మడికొండ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్‌కుమార్, కిషన్, ఎస్సైలు, సిబ్బంది శనివారం తాటికాయల గ్రామానికి వెళ్లి దారుణానికి పాల్పడిన రాజు భార్య గంగ, ఆమె సోదరులు రమేశ్, యాకయ్య, తిరుపతితోపాటు దాడికి పాల్పడిన మరో పది మంది కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని ధర్మసాగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ చేపట్టారు.
ఈ ఘటన జరిగిన తరువాత రాజుతోపాటు సదరు మహిళ కనిపించకుండాపోయారు. వారిద్దరు ఎటు వెళ్లారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ అమానుష ఘటన గురించి సమాచారం తెలుసుకున్న జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే, జూనియర్ సివిల్ జడ్జి స్వాతి శనివారం తాటికాయల గ్రామానికి వెళ్లి ఘటనపై ఆరా తీశారు.
తాటికాయలలో మహిళను వివస్త్రను చేసి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన తమకు ఆలస్యంగా తెలిసిందని కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే గ్రామానికి వెళ్లి దాడి చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తరపున ఎవరూ ఫిర్యాదు చేయలేదని అన్నారు. తామే సుమోటోగా విచారణ చేస్తున్నామని చెప్పారు. ఆ మహిళ విషయంలో గోప్యత పాటించాల్సి ఉన్నది, ఇలాంటి అమానుష, అసభ్యకర వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినా, షేర్ చేసినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.