హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ స్థానాలు (జడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల లెకతేలింది. ఈనెల 12న ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తికావడంతో సంఖ్యపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, వార్డుల సంఖ్య లెక్క కూడా తేలింది. 566 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలుగా నిర్ధారించారు. గతంలో 5,817 ఎంపీటీసీ స్థానాలుండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 5,773కు చేరింది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, ఇప్పుడు వాటి సంఖ్య 12,760కి చేరింది. గతంలో గ్రామాల వార్డులు 1,13,136 ఉండగా, ఇప్పుడు అవి 1,12,694గా మారాయి. ఈ మేరకు మంగళవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ) అధికారులు స్పష్టమైన గణాంకాలను వెల్లడించారు. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తొలిదశ కసరత్తు పూర్తయింది. అనంతరం ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వగానే వాటిని పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేయనున్నది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్కు అందించనున్నారు. వాటికి అనుగుణంగా ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నది.
గతంలో కొన్ని మండలాల్లో జనాభా ప్రకారం రెండు, మూడు ఎంపీటీసీ స్థానాలే ఉండటంతో ప్రభుత్వం చట్టసవరణ చేసింది. ఒక మండలంలో కనీసం ఐదు ఎంపీటీసీల స్థానాలు ఉండేలా మార్పులు చేసింది. వాస్తవానికి ఒక ఎంపీటీసీ స్థానానికి 3,500 జనాభా ఉండాలి. ఎంపీపీ, వైస్ ఎంపీపీలకు ఇద్దరు చొప్పున ఎంపీటీసీలు కావాలి. వారిని ఎన్నుకోవడానికి, వారు వేదికపైన కూర్చుంటే సమావేశానికి హాజరు కావడానికి కనీసం మరో ఎంపీటీసీ అయినా ఉండాలి. కానీ, వివిధ గ్రామాల్లో ఆ పరిస్థితులు లేక ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఫలితంగా అనేక మండలాల్లో ఐదు ఎంపీటీసీలు స్థానాలు ఏర్పడ్డాయి.
రాష్ట్రవ్యాప్తంగా 71 గ్రామ పంచాయతీలు జీహెచ్ఎంసీ, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కలవడంతో భారీగా మార్పులు సంభవించాయి. ఖమ్మం, భద్రాద్రి- కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల్లోని పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడంతో దీని ప్రభావం ఎంపీటీసీ స్థానాలపై పడింది.