CM KCR | హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఒకే ఒక్క మాట ‘జై తెలంగాణ’. ఆ మాటలోనే ఏదో తెలియని శక్తి. ఆ పలుకే వెయ్యి ఏనుగుల బలం. ఆ మాటే శ్వాస.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చూపిందే పోరుబాట. తొలి దశ నుంచి మలి దశ వరకూ ‘జై తెలంగాణ’ నినాదమే ఓ రణనినాదం. అందుకే స్వరాష్ట్ర సాధన కోసం ఎన్ని కేసులకైనా వెనకడుగు వేయలేదు ఉద్యమకారులు. స్వరాష్ట్ర స్వప్నం సాకారమైన వెంటనే.. ఒక్కో కేసుకు ఒక్కో జీవో తీసుకొచ్చి.. నాడు తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసులను ఎత్తివేశారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. నిన్న మొన్నటి వరకూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరిగారు. ఒకవైపు ప్రజారంజక పాలన అందిస్తూనే.. మరోవైపు కోర్టు వాయిదాలకు ఆనందంగా తిరిగారు. స్వరాష్ట్ర సాధన కోసం సాగిన సంగ్రామంలో తమపై ఓ కేసు నమోదైందంటే ఎంతో గొప్పగా భావించారు ఉద్యమకారులు. మహోన్నతమైన ఉద్యమ చరిత్రను మరిచిన కొన్ని ఆంధ్రప్రాంత పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పనిగట్టుకొని మరీ నేడు తెలంగాణపై విషం చిమ్ముతున్నాయి. ప్రభుత్వం ఎత్తివేసిన ఉద్యమ కేసులను సైతం.. మరుగున పెట్టి తెలంగాణ ప్రజలు, ఉద్యమకారుల మనోభావాలతో, ఉద్వేగాలతో ఆటలాడుకుంటున్నాయి.
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేసేందుకు సీఎం కేసీఆర్ అ న్ని చర్యలూ తీసుకున్నారు. కేంద్రప్రభుత్వ పెద్దలతో మాట్లాడి కొన్ని రైల్వే కేసులు, రాష్ట్రంలో నమోదైన కేసుల గురించి పోలీసు యంత్రాంగంతో చర్చించి.. ఒక్కో కేసుకు ఒక్కొక్క జీవో విడుదల చేస్తూ.. ఉద్యమకారులపై నమోదైన అన్ని కేసులూ ఎత్తివేయించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. తెలంగాణ పోరాటంలో ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ఉద్యమనేత కేసీఆర్ ఆధ్వర్యంలో యావత్ తెలంగాణ పోరుబాట పట్టింది. దీంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి కొన్ని కేసులు మాత్రమే ఎత్తివేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 2,254 ఉద్యమ కేసులు నమోదైనట్టు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 2,250 కేసులు పూర్తిగా ఎత్తివేయగా.. కేవలం నాలుగు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి.
మన రాష్ట్రంలో.. మన పాలనలో.. మన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరుపుకుంటున్న వేళ.. ఆంధ్రప్రాంత పత్రిక అయిన ఆంధ్రజ్యోతి.. మన అభివృద్ధి వెలుగులు చూ స్తూ కండ్లలో నిప్పులు పోసుకుంటున్నది. ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా నిసిగ్గుగా అబద్ధాలను ప్రచురిస్తున్నది. ఆ కుట్రలో భాగంగానే ఈనెల 3న ‘ఉద్యమకారులతో పరిహాసం’ అనే శీర్షికతో పచ్చి అబద్ధాలను వండివార్చింది. అందులో ఎన్నో వేల ఉద్యమ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఇందుకు జనగామ జిల్లా, బచ్చన్నపేట మండలం, కట్కూరు గ్రామానికి చెందిన ముసిని బాబును ప్రస్తావిస్తూ అతను ఉద్యోగం చేసుకోవడానికి, విదేశాలకు వెళ్లడానికి ఉద్యమ సమయంలో ఉన్న కేసులు అడ్డొస్తున్నాయని కట్టుకథని ప్రచురించింది. అందుకు అతనిపై 2011లో నమోదైన ఓ కేసును ప్రస్తావించింది.
ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించి.. ఆ కేసు పూర్వాపరాలు తెలుసుకోగా.. అది వ్యక్తిగత కేసుగా, ఆ వార్తే అబద్ధంగా నిర్ధారణ అయింది. వ్యక్తిగత కేసు కాబట్టే పోలీసులు అతనిపై కేసును ఎత్తివేయలేదని, అంతకు ముందు అతనిపై నమోదైన ఉద్యమ కేసులను ప్రభుత్వం ఎత్తివేసిందని పోలీసు వర్గాలు తెలిపాయి. నాడు రచ్చబండలో ముసినిబాబు తన వ్యక్తిగత స్వలాభం కోసం ప్రభుత్వ అధికారులతో గొడవకు దిగాడని, ఆ గొడవకు, తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. అతనిపై ఇప్పటికే వ్యక్తిగత గొడవలకు సంబంధించి మూడు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిల్లో ఒకటి ఐపీసీ 326. ఓ వ్యక్తిని మారణాయుధాలతో తీవ్రంగా గాయపర్చిన కేసు. ఇతను ప్రస్తుతం స్థానికంగా ఏబీవీపీ కార్యదర్శిగా పని చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇటువంటి వారి అభిప్రాయాలతో కథనం రాసేముందూ వాస్తవాలు తెలుసుకోకుండా.. గుడ్డెద్దు చేలో పడ్డట్టు.. కడుపునిండా కుట్రతో ఉన్న ఉన్న అంధజ్యోతి.. ‘అమవీరుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని.. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదని..తప్పుడు కథనం ప్రచురించింది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పెండింగ్‌లో ఉన్నవి కేవలం నాలుగు కేసులు మాత్రమే. అయితే వీటిల్లో రెండు రైల్వే కేసులు. వీటిల్లో ఒకటి హన్మకొండలో నమోదు కాగా.. ఇంకొకటి కాజీపేట, నెక్కొండ, ఇంటెకన్ను రైల్వే స్టేషన్లలో జరిగిన డ్యామేజీపై నమోదైంది. 10 నుంచి 15 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఈ కేసు నమోదైంది. మూడోది 2011లో వరంగల్‌లోని సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసు. నాటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిపై దాడి కేసు. ఇది ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. కాబట్టి దానిని ఎత్తివేయడం రాష్ట్రప్రభుత్వ పరిధిలో లేదు. ఇక మిగిలింది నాగర్‌కర్నూల్‌లో నమోదైన మరో ఉద్యమ కేసు. ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నది అప్పటి ఓయూ స్టూడెంట్.. ఇప్పటి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్. ఇక ఈ కేసు కూడా విత్‌డ్రా దశకు చేరుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కేసు ఎత్తివేసే ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతున్నది.