హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రభు త్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. క్యాబినెట్ ఆమోదం కోసం అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం కింద 67వేల కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. వీటన్నంటి నిర్వహణ, పర్యవేక్షణ, జవాబుదారీతనం పెంచడం కోసం సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలను తీసుకొన్నారు. ఇకపై హౌసింగ్ బోర్డు, ఐటీడీఏ, స్కూల్ ఎడ్యుకేషన్ తదితర శాఖల ఇంజినీరింగ్ విభాగాలు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారానే చేయించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దీని కోసం పీఆర్ ఇంజినీరింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. అధికారులు, ఇంజనీర్లు మరింత సమర్థంగా పనిచేయడానికి, రోడ్ల నాణ్యత పర్యవేక్షణ, పరిశీలన చేయడానికి ఎక్కువ మంది సిబ్బంది అవసరమవుతారని ప్రభుత్వం గుర్తించింది.
వీటన్నంటికీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాక క్యాబినెట్లో ఆమోదిస్తారు. వచ్చేనెల మొదటివారం కల్లా ఈ ప్రక్రియ పూర్తి కావాలనే లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తున్నారు. కింది స్థాయి పోస్టులను గతంలోనే ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం చేపట్టాల్సి ఉన్నది.