మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిగింది. ఇది తెలంగాణలోనే సాధ్యం. ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకు అభినందనలు.
– హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో కీలక ముందడుగు పడింది. వైద్యారోగ్య శాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 90 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనలో మరో ఫలితం వచ్చింది. తెలంగాణ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సోమవారం డాక్టర్ల సెలెక్షన్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్, ఎఫ్డబ్ల్యూ) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 209 పోస్టులు, ఐపీఎం పరిధిలో ఏడు పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యారోగ్య శాఖను పటిష్ఠం చేసి పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని, తద్వారా ఆరోగ్య తెలంగాణ సాధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు వైద్య శాఖకు ఓవైపు భారీగా బడ్జెట్ కేటాయించారు. మౌలిక వసతులు కల్పిస్తూ, అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెస్తూ అన్ని స్థాయిల దవాఖాలను పటిష్ఠం చేస్తున్నారు. మరోవైపు వైద్యసేవలను పేదల చెంతకు చేర్చేందుకు వైద్యుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఆరు నెలల్లోనే పూర్తి..
మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిన ఆరు నెలల్లోనే ఎంపిక ప్రక్రియ పూర్తిచేయడం విశేషం. పైగా.. రాత పరీక్ష లేకుండా, నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేశారు. డీపీహెచ్, టీవీవీపీ, ఐపీఎం పరిధిలో 969 పోస్టుల భర్తీకి ఈ ఏడాది జూన్ 15న బోర్డు నోటిఫికేషన్ ఇచ్చిం ది. ఇందులో డీపీహెచ్, ఎఫ్డబ్ల్యూ పరిధిలో 751, టీవీవీపీ పరిధిలో 211, ఐపీఎం పరిధిలో 7 పోస్టులు ఉన్నాయి. ఇవి మల్టీజోన్ పోస్టులు. వీటికి రాష్ట్రవ్యాప్తంగా 4,803 దరఖాస్తులు వచ్చా యి. అంటే ఒక్కో పోస్టుకు ఐదుగురు పోటీ పడ్డారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఎంపిక ప్రతి దశలోనూ బోర్డు అత్యంత పారదర్శకంగా నిర్వహించింది. దరఖాస్తులను అధికారులు పరిశీలించి గత నెల 9న ప్రాథమిక మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. అభ్యంతరాలను స్వీకరిం చారు. అభ్యర్థుల పూర్తి వివరాలతో సమ గ్ర జాబితాను వెబ్సైట్లో పొందుపరిచారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. గత నెల 20న రెండో మెరిట్ లిస్ట్‌ను విడుదల చేశారు. 1:2 నిష్పత్తిలో ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పు న ఎంపిక చేసి 22 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. చివరగా 950 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ సోమవారం ఫలితాలను విడుదల చేశారు.