హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : సుమారు మూడేండ్లుగా పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు చల్లింది. ఎన్నికల ముం దు ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేండ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతను కాం గ్రెస్ మోసంచేసింది. గతంలో పోలీస్ అధికారులు చెప్పిన మేరకు 19వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేవలం 5 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఆమోదం తెలుపడంతో నిరుద్యోగులు మండిపడుతున్నారు. 20 వేలతో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హోం శాఖలో మరికొన్ని పోస్టులు కలిపి 7,214 పోస్టుల భర్తీ కి ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడంతో పోలీస్ ఉద్యోగార్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొననున్నది. ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని నిరుద్యోగ జేఏసీ అంచనా వేస్తున్నది.
హోంశాఖలో సుమారు 19 వేలకుపైగా ఖాళీలు ఉంటే.. కేవలం 7,214 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతివ్వడంతో నిరుద్యోగులు మండిపడుతున్నా రు. గతంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఒకరు 19వేల ఖాళీలని, మరొకరు 17వేల ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్టు చెప్తున్నారు. 19వేల ఖాళీలు చూపి కేవలం 7వేలతోనే సరిపెడ్తరా? అని మండిపడుతున్నారు. కనీసం 17వేల ఉద్యోగాలకైనా నోటిఫికేషన్ వస్తుందేమోనని ఆశించామని, ఇప్పుడు ఒక్క పోలీసు శాఖలో కేవలం 5వేల ఉద్యోగాలకు మాత్రమే అనుమతిచ్చి ప్రభు త్వం తమను తీవ్రంగా అమానించిందని నిరుద్యోగులు వాపోతున్నారు.
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు కనీసం 20 వేల పోస్టులతో మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ప్రభుత్వ హయాంలో 2016, 2018, 2022లో ప్రతి నోటిఫికేషన్లోనూ 16వేల పోస్టులకు తగ్గకుండా కేసీఆర్ భారీ నోటిఫికేషన్లు విడుదల చేశారని నిరుద్యోగులు చెప్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడుస్తున్నా ఒక పోలీసు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, ఇప్పుడు 5వేల ఉద్యోగాలే ఇస్తామనడం శోచనీయమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేయాలని, జీవో-46 రద్దుతోపాటు వయోపరిమితిని 35 ఏం డ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.