హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : నిరుడు డిసెంబర్లో ప్రారంభించిన ‘మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ’కి రాష్ట్ర ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ యూనివర్సిటీల చట్టసవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ యూనివర్సిటీల చట్టం-1991’ని సవరిస్తూ రూపొందించిన బిల్లును సీఎం, విద్యాశాఖ మంత్రి రేవంత్‌రెడ్డి తరఫున ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 1978లో స్థాపించిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తాజా చట్టసవరణతో వర్సిటీకి స్వయంప్రతిపత్తి లభిస్తుందని పేర్కొన్నారు. వర్సిటీ విస్తరణకు 310 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నదని, రానున్న రెండేండ్లలో రూ.500 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
శాసనమండలిలో సోమవారం మూడు సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క.. తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026, తెలంగాణ పంచాయతీరాజ్ రెండో సవరణ బిల్లు-2026 బిల్లులను ప్రవేశపెట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాట్రన్ అండ్ పే స్ట్రక్షర్ రెండో సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.