హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆలహాలిక్ బేవరేజెస్ (ఆలోబెవ్) రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక బకాయిలు రూ.3,900 కోట్లను తక్షణమే చెల్లించాలని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) డైరెక్టర్ జనరల్ వినోద్గిరి, ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) సీఈఓ సంజిత్ పాధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆలహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (సీఐఏబీసీ) డైరెక్టర్ జనరల్ అనంత్ అయ్యర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారంతా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఆలోబెవ్ సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.3,900 కోట్లలో సుమారు రూ.900 కోట్లు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని పేరొన్నారు.
రూ.13,730 కోట్లకు పడిపోయిన పెట్టుబడులు
నిరుడు అక్టోబర్‌లో మద్యం రిటైల్ లైసెన్స్ దరఖాస్తు ఫీజుల ద్వారా రాష్ట్రానికి రూ.3,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరిందని అయినా బిల్లుల చెల్లింపులో జాప్యం తగదని ఆల్కోబెవ్ పేర్కొంది. గత డిసెంబర్లో కూడా ఆదాయ టర్నోవర్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరుకున్నట్టు వెల్లడైందని వివరించారు. రాష్ట్రానికి సమకూరుతున్న పన్ను ఆదాయాల్లో మూడోవంతుకు పైగా వాటా ఆలోబెవ్ రంగం అందిస్తున్నదని గుర్తు చేశారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఇదే అత్యధికమని వెల్లడించారు. ఈ రంగం ప్రతి నెల సుమారు రూ.2,300 కోట్ల నుంచి రూ.2,600 కోట్ల వరకు ఆదాయాన్ని సృష్టిస్తున్నదని పేర్కొన్నారు.
బ్రూవరీలు, డిస్టిలరీలు, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్, రిటైల్ వంటి విస్తృత ఎకోసిస్టమ్‌కు ఇది ఆధారంగా నిలుస్తున్నదని వివరించారు. ఈ రంగం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను కల్పిస్తున్నదని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయని, టీజీ-ఐపాస్ ఆమోదాలు 50 శాతానికి పైగా తగ్గాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.28,100 కోట్లుగా ఉన్న పెట్టుబడులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.13,730 కోట్లకు పడిపోయాయని పేరొన్నారు.
రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినదా?
ఓ వైపు పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిలు చెల్లించకుండా ఈ నెల చివరలో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) 56వ ఆర్థిక సదస్సులో పెట్టుబడులు ఎలా సాధిస్తారని ఆల్కోబెవ్ ప్రతినిధులు ప్రశ్నించారు. బకాయిల చెల్లింపులో జాప్యంతో పెట్టుబడిదారులు ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోతారని స్పష్టం చేశారు. ఈ స్థాయిలో చెల్లింపుల ఆలస్యం జరిగితే పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రాష్ట్ర విశ్వసనీయత, ప్రతిష్ట దెబ్బతింటాయని హెచ్చరించారు.
ఆలోబెవ్ రంగం రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుస్తున్నదని, బకాయిలను క్లియర్ చేయడంతోపాటు 45 రోజుల ఒప్పంద చెల్లింపును పునరుద్ధరించాలని కోరారు. ఆదాయం, ఉద్యోగాలు, సరఫరా కొనసాగింపును కాపాడటానికి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తిచేశారు. పెండింగ్ బకాయిలు సకాలంలో చెల్లిస్తేనే పెట్టుబడిదారుల్లో రాష్ట్ర ప్రభుత్వం పట్ల విశ్వసనీయత పెరుగుతుందని స్పష్టంచేశారు. వ్యాపారం చేయడానికి నమ్మకమైన ప్రదేశంగా తెలంగాణ ఖ్యాతి బలపడాలంటే వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని వారు సూచించారు.