వరంగల్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): రైతు యార రాజుది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం. ఆయనకు గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో ఏటా వరి, పత్తి, పసుపు పంటలు సాగు చేస్తున్నాడు. ఆరు ఎకరాల్లో పంటలు సాగు చేయాలంటే కనీసం రూ.ఒక లక్ష అవసరం. దీంతో గతంలో అప్పు కోసం వరంగల్‌లోని వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవాడు. వారిని ఒకసారి కలువగానే అప్పు దొరికేది కాదు. షావుకార్ల వద్ద రూ.100కు నెలనెల రూ.3 వడ్డీపై అప్పు చేసేవాడు. ఇది కూడా నాలుగైదుసార్లు తిరిగితే దొరికేది. అదీ అదనుకు చేతికందేది కాదు. వానకాలం, యాసంగి పంటను మార్కెట్లో అమ్మిన తర్వాత షావుకార్లకు వడ్డీతో సహా చెల్లించేవాడు. అసలుతోపాటు వడ్డీ కింద అదనంగా దాదాపు రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చేది. భార్య పిల్లలతో కలిసి రెక్కలు ముక్కలు చేసుకుంటే లాభం మత్తి కింద పోయేది.
ఒక్కొక్కసారి అప్పు దొరక్క కొంత భూమిని సాగు చేయలేక వదిలేసేవాడు. ఇలా ఆయన పలు సంవత్సరాలు పంట పెట్టుబడి అందక కొంత భూమిని విడిచిపెట్టాడు. సీఎం కేసీఆర్ రైతుబంధు పథకం ప్రవేశపెట్టడంతో ఏటా రూ.60 వేలు ప్రభుత్వం నుంచి సాయం అందుతున్నది. దీంతో పంట పెట్టుబడికి అప్పు కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లడం లేదు. ఎవరి చుట్టూ తిరగడం లేదు. రైతుబంధు వచ్చినప్పటి నుంచి గుంట భూమి కూడా వదలకుండా సాగు చేస్తున్నానని చెప్తున్నారు రాజు. గతంలో వడ్డీ రూపంలో షావుకార్లకు చెల్లించిన డబ్బు కూడా ఇప్పుడు మిగులుతుండటంతో వ్యవసాయం లాభదాయకంగా మారిందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రైతుబంధు అందజేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతు కష్టం తెలుసు. రైతుకు ఏమి కావాలో అది చేస్తున్నడు. పెట్టుబడి కోసం అప్పట్లో ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. మిత్తీలకు అప్పులు తెచ్చి, వ్యవసాయం చేస్త్తే చేతికి చిల్లి గవ్వ వచ్చేది కాదు. చేసిన కష్టం కూడా మట్టి పాలయ్యేది. కేసీఆర్ దేవుడిలెక్క రైతును ఆదుకుంటుండు. రైతుబంధు కింద పెట్టుబడి ఇస్తున్నడు. వర్షాలు కూడా బాగా పడుతుండటంతో పంటలు బాగా పండుతున్నాయి. వ్యవసాయం, రైతుకు గౌరవం తెచ్చిపెట్టిండు కేసీఆర్. రైతులను ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ఆదుకోలేదు. పెట్టుబడి కోసం ఇలా ఖాతాల్లో జమ అవుతాయని ఎన్నడూ అనుకోలేదు.
– దాసరి శ్రీనివాస్‌యాదవ్, గౌడవెల్లి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
ఇరవయ్యేండ్ల క్రితం బతుకు దెరువుకు ముంబై, హైదరాబాద్ వెళ్లేవాళ్లం. వారం రోజులు కూలి దొరకకపోతే తిండిలేక పస్తులున్నం. మాకు ఎనిమిదెకరాల పొలం ఉన్నా సాగు నీరు లేక బీడు పడి ఉండేది. కేసీఆర్ సార్ వచ్చాక చాలా మార్పు వచ్చింది. మేమూ మా ఊరికి తిరిగి వచ్చాం. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాం. పిల్లా పాపలం ఆనందంగా బతుకుతు న్నాం. రైతుబంధు ద్వారా దాదాపు రూ.40 వేలు వస్తున్నాయి. మంచిపంట పండుతున్నది. కల్వకుర్తి లిఫ్ట్ పూర్తి కావడంతో మా పొలాలకు నీరు వస్తున్నది. రెండేండ్లుగా వేరుశనగ, ఆముదం, వరి పంట లు వేసి మంచి దిగుబడులు పొందుతున్నాం. మేము బతికున్నాన్నాళ్లు సీఎం కేసీఆర్‌కు రుణబడి ఉంటాం.
– బద్దుల మహేశ్, రైతు, మమ్మాయపల్లి గ్రామం, బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
నాకు రెండున్నర ఎకరాల పొలం ఉన్నది. వరి, ఇతర పంటలు పండిస్తున్న. రైతుబంధు పైసలు నా ఖాతాల్లో రూ.12,500 పడ్డయి. గతంలో పంట లగోడికి బాకీలు చేసేటోళ్లం. ఇప్పుడు సర్కారు సాయం చేస్తుండటంతో ఆ తిప్పలు తప్పినయి. టైమ్‌కు రైతుబంధు పైసలు చేతికి అస్తున్నయి. సేట్ల దగ్గర చేయిచాచి బాకీలు చేసే పరిస్థితి పోయింది. సీఎం కేసీఆర్ రైతులను చాన మంచిగ చూసుకుంటున్నడు. రైతుబంధు, కరెంట్ ఫ్రీగా ఇవ్వవట్టె. రైతుబీమా చేయించిండు. గతంల ఏ సర్కారూ మమ్మల్ని గింతమంచిగ సూసుకోలేదు. తెలంగాణ అచ్చినంక రైతులకు విలువ పెరిగింది. కాలం కూడా మంచిగ అయితున్నది. ఎరువులకు, విత్తనాలకు ఇబ్బంది అయితలేదు. ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నయి. ఎక్కడెక్కడికెలో అచ్చి మా దగ్గర పొలం నాట్లేసి పోతుండ్రు. అందరికీ బతుకుదెరువు దొరుకుతున్నది. నీళ్లకు ఫికరు లేకుండా పోయింది. భూముల రేట్లు మస్తు పెరిగినయి.
– మాదన్ లింగంగౌడ్, రైతు, తిమ్మక్కపల్లి గ్రామం, రాయపోల్ మండలం, సిద్దిపేట జిల్లా
నాకు 8 ఎకరాల పొలం ఉన్నది. 4 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో కంది, 2 ఎకరాల్లో వరి పండిస్తున్న. గతంలో బయట అప్పులు తెస్తేనే సాగు సాధ్యం అయ్యేది. సీఎం కేసీఆర్ ఓ రైతు బిడ్డగా ఆలోచించి రైతుబంధుతో పంట పెట్టుబడి కష్టాలు తీర్చిండు. రైతుబంధు ప్రతిసారీ వస్తుండటంతో ధైర్యంగా సాగు చేస్తున్నాం. పెట్టుబడి కోసం ఎవరినీ చేయిచాపి అడగాల్సిన పనిలేదు. ప్రస్తుతం కంది, వరి పంటలు బాగా ఉన్నాయి. రైతుబంధు సమయానికి అందుతుండటంతో నా కష్టాలు తీరిపోయాయి. ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రతి గింజను సమయానికి కొంటున్నది. ఆ డబ్బులు కూడా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. దళారులను నమ్మకుండా, తూకంలో మోసాలు లేకుండా ఎవరి మీదా ఆధారపడకుండా సాగు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ రైతులను ఆపద్బాంధవుడిలా ఆదుకొంటున్నారు.
– బుల్ల రాములు, జనగామ, పెద్దేముల్ మండలం, వికారాబాద్ జిల్లా
నాలుగు ఎకరాల భూమి ఉన్నది. తెలంగాణ రాక ముందు నీళ్లులేక బోర్లు ఎండిపోయినవి. ఉన్న నీళ్లు తోడుదామంటే కరెంట్ ఉండక పోయేది. కరెంట్ కోసం బావుల వద్దనే నిద్రలేని రాత్రులు గడిపేటోళ్లం. అప్పట్లో పంట పెట్టుబడికి డబ్బులు దొరికేవి కావు. ఒకసారి మిర్చి పంట చేతికొచ్చే ముందు పురుగు పట్టింది. మందు కొట్టడానికి అప్పుకోసం పోతే అప్పు పుట్టలేదు. మిర్చి పంట మొత్తం పాడైంది. వరి వేస్తే నీళ్లులేక ఎండిపోయింది. కేసీఆర్ సార్ సీఎం అయినంక రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఎస్సారెస్పీ కాలువల ద్వారా వానకాలం, యాసంగి రెండు పంటలకు నీళ్లు వస్తున్నాయి. ఎప్పుడంటే అప్పుడు బావుల కాడ మోటర్లు ఆన్ చేసుకుంటున్నాం. రెండు ఎకరాల పొలంలో 8 పుట్ల వడ్లు పండుతున్నాయి. మరో రెండు ఎకరాల్లో మిర్చి వేసా. రైతుబంధు డబ్బులతో దర్జాగా బతుకుతున్న. పెట్టుబడి కోసం ఎవరి వద్దా అప్పుకు చేయి చాచడం లేదు.
– బానోత్ రాములు, పెద్ద రామోజితండా, మహబూబాబాద్ జిల్లా