హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకు రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డుతున్నది. ఈ కోర్సుల నిర్వహణకు సాక్షాత్తు రాష్ట్ర సర్కారే అనుమతిని ఇవ్వడం లేదు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పర్మిషన్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటున్నది. ఉద్యోగాలు చేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం బీటెక్, డిప్లొమా కోర్సుల్లో 30 సీట్ల చొప్పున నిర్వహించేందుకు ఏఐసీటీఈ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా కోర్సుల్లో చేరేందుకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ నుంచి తీవ్ర డిమాండ్ ఉన్నది. ఇప్పుడు సర్కారు అనుమతిని నిరాకరించడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఆయా కోర్సుల్లో చేరేందుకు తొలి నుంచి ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతూ వచ్చారు.
ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు చేరేందుకు ముందుకు రావడంతో ఆయా కోర్సుల్లో డిమాండ్ పెరిగింది. ఆ కోర్సుల నిర్వహణతో సర్కారు వచ్చిన నష్టమేమీ లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంపై ఆర్థికభారం పడేది కూడా లేదు. తాజాగా ఈ కోర్సుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థంకావడం లేదు. డీఆర్డీవో ఉద్యోగులు కొందరు ఇటీవలే ఓ కాలేజీలో అడ్మిషన్ కోసం వెళ్లగా, ఈ విద్యా సంవత్సరం తమకు అనుమతి రాలేదని చెప్పడంతో సదరు ఉద్యోగులు నిరాశతో వెనుదిరిగారు. ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న 200 మంది వరకు ఉద్యోగులు ఇటీవలే సాంకేతిక విద్యామండలి అధికారులను కలిసి వర్కింగ్ ప్రొఫెషనల్స్ డిప్లొమాలో చేరే అవకాశం కల్పించాలని కోరారు. ఐటీఐ పూర్తిచేసిన తమకు డిప్లొమా కోర్సుల్లో చేరే అవకాశం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.
ఈవెనింగ్ బీటెక్, డిప్లొమా కోర్సులకున్న డిమాండ్ నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి 12 కాలేజీలకు అనుమతిని ఇచ్చింది. వాటిల్లో ఐదారు కాలేజీల్లోనే ఒకే బ్యాచ్ చొప్పున పర్మిషన్ వచ్చింది. కంప్యూటర్‌సైన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – మెషిన్ లర్నింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ -ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ప్రవేశాలు కల్పించారు. కానీ ఇప్పుడు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలోనే ఈ కోర్సు నడుస్తున్నది. ఇతర ఏ కాలేజీకి సర్కారు అనుమతి ఇవ్వలేదు.
ఉద్యోగం చేస్తూనే తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పర్చుకునేందుకు ఉన్నత విద్యాభ్యాసం చేసేవారినే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటారు. డిప్లొమా పూర్తిచేసిన వారు బీటెక్ సెకండియర్‌లో, ఐటీఐ పూర్తిచేసిన వారు డిప్లొమా సెకండియర్ కోర్సులో నేరుగా ప్రవేశాలు పొందవచ్చు. అది కూడా ఇప్పటికే చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా, ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా ఎంచక్కా సాయంత్రం పూట తరగతుల్లో చదువుకోవచ్చు. ఈ సీట్ల భర్తీకి ప్రత్యేకంగా ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు. కనుక దీనిని ఈవెనింగ్ బీటెక్, ఈవెనింగ్ డిప్లొమా అని కూడా పిలుస్తారు. ఉద్యోగంలో స్థిరపడి పైచదువులు చదవలేకపోయిన వారికి ఈ కోర్సులు మంచి అవకాశం. గతంలో ఈవెనింగ్ బీఏ, ఈవెనింగ్ లా కోర్సులను నిర్వహించే వారు.. కాలక్రమేణా ఈ కోర్సులు రద్దయ్యాయి.