హైదరాబాద్ : రాష్ట్రంలోని గొర్రె కాపరుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ స్పష్టం చేశారు. మాసబ్‌ట్యాంకులోని గొర్రెల, మేకల అభివృద్ధి సహకార సంఘం కార్యాలయంలో దూదిమెట్ల బాలరాజు యాదవ్‌తో జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మన్ గోర్ధన్ రైఖా సమావేశమై.. రాష్ట్రంలో గొర్రెల పెంపకదారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అద్భుతమని రైఖా కొనియాడారు.
ఈ సందర్భంగా దూదిమెట్ల బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. ప్రత్యేక గొర్రెల అభివృద్ధి పథకానికి ఇప్పటి వరకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద 3.93 లక్షల మంది లబ్దిదారులకు 75 శాతం సబ్సిడీపై 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రాథమిక గొర్రెల సహకార సంఘాల్లో ఉన్న సభ్యులకు కూడా గొర్రెల యూనిట్లు ఇప్పించడం జరుగుతుందన్నారు.
ఈ పథకం కింద గొర్రెల యూనిట్లను సబ్సిడీపై ఇవ్వడమే కాకుండా వాటికి కావాల్సిన మందులు, దాణా, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించబడుతుందని పేర్కొన్నారు. ఈ పథకం అమలు చేసిన తర్వాత గొర్రెల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
గొర్రె కాపరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గోర్ధన్ రైఖా ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేయటానికి త్వరలో మళ్ళీ రాష్ట్రానికి వస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గొర్రెల, మేకల శిక్షణ కేంద్రానికి కావాల్సిన నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల ఫెడరేషన్ అధికారులు పాల్గొన్నారు.