Miss World Competitions | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఇంగ్లండ్ సుందరి మిల్లా మ్యాగీకి ఎదురైన పరాభవంపై తెలంగాణ ప్రభుత్వం విచారణ చేపట్టింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖాగోయల్, ఐపీఎస్ అధికారి రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఎంక్వయిరీ చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులను అడిగి పోటీల నిర్వహణ తీరు, ఇబ్బందులేమైనా ఎదురవుతున్నాయా? మ్యాగీ ఆరోపణల్లో నిజమెంత?అని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వీడియోలను సైతం రికార్డు చేస్తున్నారు. ఆమె పాల్గొన్న డిన్నర్లో ఎవరెవరు ఉన్నారు? ఆరోజు ఆమెతో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలతో కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి విచారణ వివరాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. పోటీదారులతోపాటు మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వివరాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. మ్యాగీ చేసిన ఆరోపణలను మోర్లే ఖండించారు.