హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇప్పుడు ఇసుక అందని ద్రాక్షగా మారింది. ఇసుక ధరను ప్రభుత్వం భారీగా పెంచింది. దొడ్డురకం టన్ను ఇసుక రూ.1,600, సన్నరకం రూ.1,800గా అధికారికంగా ప్రకటించింది. రవాణా చార్జీలను వినియోగదారులే భరించాలి. ఈ మేరకు ఇసుక విక్రయాల కోసం ప్రభుత్వం తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్‌మెట్, వట్టినాగులపల్లి, బౌరంపేట్‌లో ఇసుక బజార్లను ఏర్పాటుచేసింది. ఇకనుంచి ఇసుక కావాల్సినవారు ఇక్కడి నుంచి తాము నిర్ధారించిన రేటు చెల్లించి కొనుగోలు చేయాలని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ మూడు ఇసుక బజార్ల వద్ద పైరేటు ఉంటుందని స్పష్టంచేస్తూ బోర్డులనే ఏర్పాటుచేసింది. ఏడాదిపాటు ఇవే ధరలు కొనసాగుతాయని స్పష్టంచేసింది.
గతంలో డిమాండ్, సైప్లె ఆధారంగా టన్ను ఇసుక ధర బహిరంగ మార్కెట్లో రూ.1,200, రూ.1,400 వరకు ఉండేది. పూర్తిగా లారీ లోడు తీసుకునేవారికి ఇదే ధరకు ఇంటి వద్దకు సరఫరా చేసేవారు. లోడు కాకుండా తక్కువ ఇసుక కావాల్సినవారు సమీపంలోని ఇసుక అడ్డాల నుంచి ఇదే ధరకు కొనుగోలు చేసి రవాణా చార్జీలను అదనంగా చెల్లించేవారు. అయినా ఇంటికి చేరేసరికి ధర రూ.1,600లోపే పడేది. ఇప్పుడు ఇసుక బజార్ల వద్ద అధికారికంగానే రూ.1,600-1,800గా టీజీఎండీసీ ధరలు నిర్ణయించడం గమనార్హం. ఇకనుంచి వినియోగదారులు ఇసుక బజార్ల నుంచే ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా నిర్మాణదారులు కొనుగోలు చేయాలంటే తామే సొంతంగా టీజీఎండీసీ పోర్టల్‌లో బుక్ చేసుకొని, వాహనాలను మాట్లాడుకొని తెచ్చుకోవచ్చని వారు తెలిపారు.
మరోవైపు, ఇసుక ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.2,200-రూ.2,300 వరకూ పలుకుతున్నది. గతంలో మాదిరిగా ఇసుక రవాణా చేయకుండా అధికారులు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, ఇసుక క్వారీల వద్ద లోడింగ్ కోసం రెండు, మూడురోజుల సమయం పడుతుండటంతో మార్కెట్లో ఇసుకకు తీవ్ర కొరత ఏర్పడింది. ఒకవేళ సైప్లె పెరిగినా టీజీఎండీసీకి చెల్లించే డీడీ, డీజిల్ ఖర్చులు, టోల్ చార్జీలు, రవాణా ఖర్చులు అన్నీ కలుపుకుంటే టన్ను ఇసుక రూ.2,000లోపు విక్రయించే అవకాశం లేదని రవాణాదారులు చెప్తున్నారు.
ఇసుక బజార్లో రూ.1,600 చెల్లించి ఇసుక కొనుగోలు చేసినా ఇంటికి చేరేసరికి రవాణా చార్జీలు కలుపుకుంటే అదికూడా రూ.2,000కు తక్కువ ఉండే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు. మొత్తమ్మీద అక్రమాలను అరికట్టే పేరుతో ఇసుకపై ప్రభుత్వం చేసిన ప్రయోగం వినియోగదారులపై గుదిబండగా మారిందనడంలో సందేహం లేదు.