హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకొచ్చిన జీవో-49 అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ ఏరియాను, రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏరియాను కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కుమ్రంభీం కన్జర్వేషన్ రిజర్వ్ కారిడార్‌గా ప్రకటించింది.
వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 సెక్షన్ 36(ఏ) ప్రకారం ప్రపోజల్స్‌ను ప్రకటిస్తూ మే 30న జీవో- 49ను జారీచేసింది. అయితే, ఐదో షెడ్యూల్ ప్రాంతానికి సంబంధించి రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70 యాక్ట్, పెసా చట్టాలతోపాటు ఆదివాసీల అస్తిత్వం, సంస్కృతీ సంప్రదాయాలు, హకులను కాలరాస్తూ ఎలాంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో-49ను తీసుకొనిరావడంపై ఆదివాసీ సంఘాలు భగ్గమన్నాయి.
ఆ జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గొడం గణేశ్ నేతృత్వంలో ఆదిలాబాద్ జిల్లా బంద్‌ను చేపట్టాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. జీవో-49 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌కు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఆదివాసీ సంఘాలు మాత్రం జీవో-49ను నిలుపుదల చేయడం కాకుండా, పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి.
రాబోయే పంచాయతీ ఎన్నికల కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీవో-49 అమలును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని ఆదివాసీ సంఘాలు, మేధావులు అభిప్రాయపడుతున్నారు. జీవో-49పై ఆదివాసీలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే భంగపాటు తప్పదని గ్రహించిన సర్కార్ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.