Exports Committee | సంగారెడ్డి పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ఐ శాస్త్రవేత్త వెంకటేశ్వరావు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. చీఫ్ సైంటిస్ట్ ప్రతాప్‌కుమార్, సూర్యానారాయణ, పుణేకి చెందిన భద్రతా అధికారి సంతోష్ ఘుగేలను సభ్యులుగా నియమించింది. సిగాచి పరిశ్రమ ఘటనపై నెల రోజుల్లో కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు భద్రతా నియమావళిని పాటించారా లేదా? తెలుసుకోవడంతో పాటు ప్రమాదాలు మళ్లీ జరుగకుండా తీసుకోవాల్సిన చర్యలను కమిటీ ప్రభుత్వానికి సూచించనున్నది. కమిటీకి సహకారం అందించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పాశ మైలారంలోని సిగాచి పరిశ్రమలో సోమవారం రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 50 మందికిపైగా మృతి చెందారు. మరికొందరు కార్మికులు గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 34 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.మరో వైపు ఈ ఘటనలో మృతదేహాల గుర్తింపు కొనసాగుతున్నది. మరో ఐదు మృతదేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. ఇప్పటి వరకు 18 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అందించారు. గురువారం మరో 11 మంది కార్మికుల డీఎన్ఏ రిపోర్టులు అందనున్నాయి. ఆయా రిపోర్టుల ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఈ ఘటనలో మరో 11 మంది గల్లంతైన విషయం తెలిసిందే. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.