మెదక్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఒకరి స్వార్థం కోసం మరొకరు బలవుతున్నారు. రూ.7 కోట్ల బీమా పరిహారం కోసం ఓ ప్రభుత్వ ఉద్యోగి తాను చనిపోయినట్టు అందరినీ నమ్మించాడు. చివరకు సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులకు చిక్కాడు. అయితే ఈ నెల 9న మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో జరిగిన కారు ప్రమాదంలో సజీవదహనమైన వ్యక్తి ఎవరు? అనే విషయాన్ని తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వివరాలు ఇలా.. టేక్మాల్ మం డలం భద్యా తండాకు చెందిన ధర్మానాయక్ హైదరాబాద్ సెక్రటేరియట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ధర్మాకు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటున్నది.
ఇందుకోసం రూ.2 కోట్ల వరకు అప్పు చేశాడు. తాను చనిపోతే తనపేరిట రూ.7 కోట్ల వరకు బీమా డబ్బులు వస్తాయని, దాంతో అప్పులు తీరుతాయని భావించాడు. ఈనెల 5న ధర్మానాయక్ తన స్నేహితులతో కలిసి బాసరకు వెళ్లినట్టు సమాచారం. ఇందులో ఓ వ్యక్తి కనిపించకుండా పోయాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా ఈనెల 9న టేక్మా ల్ మండలం వెంకటాపూర్ వద్ద కారు ప్రమాదానికి గురైంది. అందులో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి టేక్మాల్ మండలం భద్యా తండాకు చెందిన ధర్మానాయక్‌గా భావించారు. ఆయన భార్య లీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సిగ్నల్ ఆధారంగా ధర్మా ఫోన్‌ను గుర్తించిన పోలీసులు
పోలీసుల దర్యాప్తులో నివ్వెరబోయే వాస్తవాలు బయటపడ్డాయి. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ధర్మానాయక్ పుణెలో ఉన్నట్టు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని త మదైన శైలిలో విచారించగా.. ప్రమాదంలో చ నిపోయింది మరో వ్యక్తి అని వెల్లడైంది. బీమా డబ్బుల కోసం ధర్మా నాటకమాడినట్టు పోలీసులు తేల్చారు. కారులోని మృతదేహం ఎవరిదనే అంశంపై విచారణ జరుపుతున్నారు.