హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు డిస్కంలలోని డైరెక్టర్లందరికీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. గత కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వారు డిస్కంలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, అందరినీ తక్షణం తొలగిస్తున్నామని విద్యుత్తు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏఎం రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే కొత్త డైరెక్టర్ల నియామకానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల మేరకు గరిష్ఠంగా నాలుగేండ్లు మాత్రమే ఒక వ్యక్తి డైరెక్టర్‌గా కొనసాగే అవకాశం ఉన్నది. ఎస్పీడీసీఎల్లో జే శ్రీనివాసరెడ్డి, టీ శ్రీనివాస్, కే రాములు, జీ పర్వతం, సీహెచ్ మదన్మోహన్రావు, ఎస్ స్వామిరెడ్డి, గంప గోపాల్, ఎన్పీడీసీఎల్లో బీ వెంకటేశ్వర్రావు, పీ మోహన్‌రెడ్డి, పీ సంధ్యారాణి, పీ గణపతి తొలగించిన వారిలో ఉన్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ సోమవారం సాయంత్రం ఏడుగురు డైరెక్టర్ల కొనసాగింపును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.