హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. అత్యున్నత విద్యా ప్రమాణాలకు, నాణ్యమైన విద్యకు పర్యాయపదాలుగా నిలుస్తున్నాయి. సకల సౌకర్యాలు.. వసతులకు కేరాఫ్ అడ్రస్‌గా విరాజిల్లుతున్నాయి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) మంజూరుచేసిన గ్రేడింగ్స్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. డిగ్రీ కాలేజీలకిచ్చే న్యాక్ గ్రేడింగ్‌లో ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజేఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జాతీయంగా అత్యధిక క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)తో జాతీయ స్థాయిలో నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో ఈ కాలేజీ 4 సీజీపీఏకు గాను 3.64 సీజీపీఏతో ఏ++ గ్రేడ్ దక్కించుకుంది. జాతీయస్థాయిలో ఇదే అత్యధిక సీజీపీఏ స్కోర్ కావడం విశేషం. బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 3.50, హనుమకొండ 3.33, సంగారెడ్డి కాలేజీ 3.33 సీజీపీఏతో న్యాక్ ఏ+ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. ఇది రెండో అత్యధిక సీజీపీఏ కావడం గమనార్హం. మొత్తంగా రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు నయా చరిత్రను లిఖిస్తున్నాయి. తెలంగాణ ఘనతను జాతీయస్థాయిలో చాటుతున్నాయి.
రాష్ట్రంలో మొత్తంగా 144 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో ఇప్పటి వరకు 93 కళాశాలలు న్యాక్ గుర్తింపు దక్కించుకున్నాయి. మిగిలిన 51 కాలేజీల్లో 22 కొత్తగా ఏర్పడినవి. మరో ఏడు కాలేజీలు న్యాక్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. 2023 ఆగస్టు నాటికి రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు సహా అన్ని రకాల విద్యాసంస్థలు కలుపుకొంటే 289 కాలేజీలు న్యాక్ గుర్తింపును దక్కించుకున్నాయి. న్యాక్ గుర్తింపు పొందే కాలేజీలను ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రోత్సహిస్తున్నది. సెల్ఫ్ స్టడీ రిపోర్ట్‌ల తయారీకి గాను వర్సిటీలకు రూ. 2 లక్షలు, కాలేజీలకు రూ. 1లక్ష వరకు గ్రాంట్‌గా ఇస్తున్నారు. దీంతో ప్రైవేట్‌కు దీటుగా తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీకాలేజీలు 6 ప్రమాణాలు మెరుగుపరుచుకుంటున్నాయి. వసతులు పెంచుకుని ప్రగతి పథంలో పయనిస్తున్నాయి.
రాష్ట్రంలోని 93 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపును దక్కించుకోవడం శుభపరిణామం. ఖమ్మంలోని ఎస్సార్ అండ్ బీజేఎన్నార్ కాలేజీ జాతీయస్థాయిలో నెంబర్ వన్ గ్రేడ్‌ను దక్కించుకోవడం హర్షణీయం. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏటేటా న్యాక్ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంటుండడం మనందరికీ గర్వకారణం. కళాశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, రాష్ట్రలోని కాలేజీలను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తున్నాం. జాతీయస్థాయి గ్రాస్ ఎన్రోల్మెంట్ (జీఈఆర్) 27.3 శాతంతో పొల్చితే మనం 36.2 శాతంతో ఉత్తమంగా ఉన్నాం. న్యాక్ గుర్తింపు పొందిన కాలేజీల్లో మన కన్నా పెద్ద రాష్ర్టాలైన రాజస్థాన్, అస్సాం వంటి రాష్ర్టాల కన్నా మనమే ముందంజలో నిలిచాం. న్యాక్ గుర్తింపు పొందిన కాలేజీల్లో రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసి, స్కాలర్లను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాం.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి