Musi Project | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): మూసీ అభివృద్ధికి థేమ్స్ మాడల్‌ను అమలు చేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి నిజానికి పాకిస్థాన్ మాడల్‌ను ఫాలో అవుతున్నట్టు అర్థమవుతున్నది. పాకిస్థాన్‌లోని రావి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును మధ్యలోనే అటకెక్కించి, వేల కోట్ల స్కామ్‌లకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగపూర్‌కు చెందిన వివాదాస్పద మెయిన్‌హార్ట్ కంపెనీకి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుమాస్టర్ ప్లాన్ బాధ్యతలను కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్‌లో రావి రివర్ ఫ్రంట్ పేరిట నదీపరీవాహంలోని ఆవాసాలను కూల్చినట్టే ఇక్కడ కూడా మూసీ సుందరీకరణ పేరిట బడుగువర్గాలు కట్టుకున్న ఇండ్లను కాంగ్రెస్ సర్కారు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తున్నది. దీంతో థేమ్స్ మాడల్ కాదు.. పాక్ మాడల్‌ను రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్నదంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం కావాలంటే.. ఏడాది, ఐదేండ్లు, పదేండ్ల వరకూ సమయం పట్టొచ్చు. అయితే, 77 ఏండ్ల కిందట ప్రతిపాదించిన ఓ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కలేదంటే నమ్మగలమా? పాకిస్థాన్ ఇందుకు వేదికగా నిలిచింది. భారత్ నుంచి విడిపోయిన 1947లో రావి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును అప్పటి పాక్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అలా దాదాపు 73ఏండ్లు వాయిదాపడుతున్న ఈ ప్రాజెక్టును 2020లో ఎట్టకేలకు అప్పటి ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం మళ్లీ తెరమీదకు తీసుకొచ్చింది. రూ. 40 వేల కోట్లతో 44 వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును చేపట్టాలని లాహోర్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించింది. ఈ మేరకు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ కంపెనీకి రావి రివర్‌ఫ్రంట్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఆర్ఆర్యూడీపీ) ప్లానింగ్ బాధ్యతలను అప్పగించింది.
రావి ప్రాజెక్టు మెయిన్‌హార్ట్‌కు దక్కడంలో పాకిస్థాన్‌లోని మెయిన్‌హార్ట్ శాఖ ఆపరేషన్స్ విభాగంలో డైరెక్టర్‌గా గతంలో పనిచేసిన అమీన్ కీలకపాత్ర పోషించినట్టు చెప్తారు. 2012-2020 మధ్య ఆయన మెయిన్హార్ట్లో కీలక బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2020 ఏప్రిల్‌లో రావి రివర్‌ఫ్రంట్ అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే మెయిన్‌హార్ట్‌కు ఈ రావి ప్రాజెక్టు ఖరారైనట్టు చెప్తారు. అయితే, ఈ డీల్ జరిగినప్పుడు తాను ఆర్ఆర్యూడీపీ సీఈవోగా బాధ్యతలు చేపట్టలేదని అమీన్ చెప్తుండటం గమనార్హం.
లండన్‌లోని థేమ్స్ మాడల్‌ను రావి రివర్ ఫ్రంట్‌లో అమలు చేస్తామంటూ గ్రాఫిక్స్ డిజైన్స్‌తో మెయిన్‌హార్ట్ కంపెనీ పాక్ సర్కారును బురిడీ కొట్టించినట్టు విమర్శలు ఉన్నాయి. పాకిస్థాన్‌లోని హక్కుల కార్యకర్తల కథనం ప్రకారం.. తొలుత 44 వేల ఎకరాల్లో చేపట్టాలనుకొన్న ప్రాజెక్టును 1,02,074 ఎకరాలకు విస్తరింపజేసింది. ప్రాజెక్టు వ్యయాన్ని కూడా రూ. 2.5 లక్షల కోట్లకు పెంచింది. అయితే 46 కిలోమీటర్ల మేర చేపట్టే ప్రాజెక్టుకు ఇంతమేర నిధులు ఎందుకంటూ అక్కడి ప్రతిపక్షాలు, హక్కుల కార్యకర్తలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. దీంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఈ ప్రాజెక్టులో భాగంగానే ఓ అర్బన్ ఫారెస్టు, మూడు బరాజ్‌లు, ఆరు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఓ సరస్సు, 60 లక్షల చెట్లను ఏర్పాటు చేస్తామని మెయిన్‌హార్ట్ ప్రకటించినట్టు సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు. తొలిదశలో భాగంగా రూ. 15 వేల కోట్లను ప్రభుత్వం నుంచి తీసుకొని ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తున్నట్టు కంపెనీ వెల్లడించిందని అయితే, ప్రాజెక్టు ఏమాత్రం ముందుకు జరుగలేదని మండిపడ్డారు.
రావి రివర్ ఫ్రంట్‌లో థేమ్స్ మాడల్‌ను అనుసరిస్తామన్న ప్రభుత్వం స్వీయ మాడల్‌ను ఫాలో అయ్యింది. నదీప్రక్షాళనకు తొలుత సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సిఉండగా, ముందుగా నదీపరీవాహంలోని పేదల ఇండ్లు, చిరువ్యాపారుల వాణిజ్య సముదాయాలను తొలగించిందని హక్కుల కార్యకర్తలు వెల్లడించారు. నది ఒడ్డున ఉన్న రైతుల వందలాది ఎకరాల భూములను ప్రాజెక్టు పేరిట ప్రభుత్వం సేకరించిందని, తగిన పరిహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆ భూముల్లో కొన్నింటిని కార్పొరేట్లకు కట్టబెట్టారని మండిపడ్డారు. దీంతో పలువురు లాహోర్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం అక్రమాలు జరిగినట్టు గుర్తించి అటు ప్రభుత్వాన్ని, ఇటు మెయిన్‌హార్ట్ కంపెనీని తీవ్రంగా తప్పుబట్టినట్టు, ప్రాజెక్టును నిలిపేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ప్రాజెక్టు పనులు మాత్రం ముందుకు జరుగలేదని సామాజికవేత్తలు తెలిపారు.
ఒకవైపు రావి రివర్ ఫ్రంట్ వివాదం కొనసాగుతుండగానే మెయిన్‌హార్ట్ తన అక్రమాలకు తెరతీసినట్టు విమర్శలు ఉన్నాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పాక్‌లోని ఓ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో స్థానిక ప్రైవేటు బ్యాంకుతో కలిసి ఇండ్ల కొనుగోలుదారులను వేల కోట్ల రూపాయల మేర మోసం చేసినట్టు సంస్థపై ఓ కేసు నమోదైంది. రూ. 300 కోట్ల మేర హవాలా కుంభకోణానికి పాల్పడినట్టు మరో అభియోగం నమోదైంది. ఇదే సమయంలో మధ్యలో నిలిపేసిన రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును కొనసాగించాలని మెయిన్హార్ట్పై ఒత్తిళ్లు పెరిగాయి. అయితే, కోర్టుల్లో కేసులు, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయన్న నెపంతో తాము ఈ ప్రాజెక్టును చేపట్టలేమని కంపెనీ చేతులెత్తేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అలా రావి రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టులో పాక్ ప్రభుత్వాన్ని, ప్రజలను రూ. 15 వేల కోట్ల మేర మెయిన్‌హార్ట్ మోసం చేసిందని సామాజిక కార్యకర్తలు మండిపడ్డారు. అందుకనే కంపెనీ యజమాని నసీం షెహజాద్, ఆయన కొడుకు, కంపెనీ సీఈవో ఒమర్ షెహజాద్‌పై పలు కేసులను సర్కారు నమోదు చేసిందని, దీంతో వీళ్లిద్దరూ పాక్‌ను విడిచి వెళ్లిపోయారని తెలిపారు. ఈ క్రమంలోనే నసీం షెహజాద్, ఒమర్ షెహజాద్‌ను దేశం విడిచి పారిపోయిన నేరగాళ్లుగా పాక్ ప్రభుత్వం గత నవంబర్‌లో ప్రకటించినట్టు చెప్తున్నారు. అయితే, ఈ విమర్శలను మెయిన్‌హార్ట్ ఖండిస్తున్నది. కాగా.. ఇలాంటి వివాదాల్లో కూరుకుపోయిన మెయిన్‌హార్ట్ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ బాధ్యతలను అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో మూసీ ప్రాజెక్టుకు, అటు ఏపీలోని అమరావతి నిర్మాణానికి చైనాలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంకు (ఎన్డీబీ) ఫండింగ్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ రెండు ప్రాజెక్టుల ప్లానింగ్‌ను మెయిన్‌హార్ట్ చేపడుతుండటం, మెయిన్‌హార్ట్ కంపెనీలో కీలక భాగస్వామి అయిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్‌కు ఎన్డీబీ డైరెక్టర్ జనరల్ పాండ్యన్ మంచి మిత్రుడు కావడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. అయితే పాక్‌లోని రావి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ప్లానింగ్‌ను కూడా మెయిన్‌హార్ట్ కంపెనీ చేపట్టినప్పటికీ, ఎన్డీబీ నిధులివ్వకపోవడం గమనార్హం. దీనికి కారణం.. బ్రిక్స్ కూటమి దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ప్రభుత్వాలు లేదా ప్రైవేటు కంపెనీలు చేపట్టే పలు ప్రాజెక్టులకు మాత్రమే ఈ బ్యాంకు ఆర్థిక సాయాన్ని సమకూర్చాలనే నిబంధనలు ఉన్నాయి. పాక్ బ్రిక్స్ కూటమిలో లేకపోవడంతో ఎన్డీబీ రావికి ఫండింగ్ ఇవ్వలేకపోయిందని నిపుణులు చెప్తున్నారు.