హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి కోర్సుల ప్రవేశాల్లో నాన్‌లోకల్ కోటా సీట్లపై ప్రభుత్వం ఏదీ తేల్చుకోలేకపోతున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై విద్యాశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర విభజన సమయంలో ఇరు రాష్ర్టాలు సమాన అవకాశాలు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ సీట్లల్లో 15 శాతం సీట్లను ఏపీ విద్యార్థులకు కేటాయించేవారు.
అయితే, ఈ విద్యాసంవత్సరంతో పదేండ్ల గడువు ముగిసింది. ఇప్పుడు కొత్తగా నాన్‌లోకల్ కోటాపై ప్రభుత్వం జీవోను జారీచేయాల్సి ఉన్నది. ప్రధానంగా మెడికల్ సీట్ల భర్తీలో సుప్రీం తీర్పును అధ్యయనం చేస్తున్నది. ఈ తీర్పు అన్ని కోర్సులకు వర్తించనుండటంతో లోకల్, నాన్‌లోకల్ కోటాపై సందిగ్ధం నెలకొన్నది. స్థానికత విషయంలో ఏ తరగతిని ప్రమాణికంగా తీసుకోవాలన్న అంశంపైనా ఉన్నతాధికారుల్లో చర్చ జరుగుతున్నది.
1 నుంచి 7 తరగతులను తీసుకుంటే కొందరు బోగస్సర్టిఫికెట్లతో స్థానికులుగా చెలామణి అవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. 8 నుంచి 12 తరగతులను ప్రామాణికంగా తీసుకుంటే పదో తరగతి, ఇంటర్ మెమోల ఆధారంగా బోగస్ వారిని గుర్తించవచ్చన్న చర్చ అధికారుల్లో ఉన్నది.