హైదరాబాద్: కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలో (Kurnool Bus Fire Tragedy) మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాపడిన వారికి రూ.2 లక్షల ఆర్థికసాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామన్నారు. అవసరమైన సహాయచర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రైవేట్ బస్సుల వేగనియంత్రణకు చర్యలు తీసుకుంటాన్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక మంత్రుల సమావేశం నిర్వహిస్తామన్నారు. బస్సుల్లో భద్రతాచర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. బస్సుల ఓవర్ స్పీడ్ నియంత్రణకు కమిటీ వేస్తామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ మధ్య అనారోగ్యకర పోటీ ఉందని, దానిని నివారిస్తామని వెల్లడించారు.