LRS | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ప్రకటించిన లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్-ఎల్ఆర్ఎస్ ఆర్భాటపు ప్రకటన అని, ఆచరణ అసాధ్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఎలాంటి ముందస్తు కసరత్తు లేకుండా హడావుడిగా ప్రకటన చేశారమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేరుకుపోయిన దరఖాస్తులు, పరిష్కరించేందుకు కావాల్సిన సిబ్బంది మధ్య పొంతన లేకపోవడమే ఇందుకు కారణమని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ కోసం 25.60 లక్షల దరఖాస్తులు రాగా వీటిలో ఫీజులు చెల్లించి పరిష్కారానికి నోచుకున్నవి 3 లక్షలకు మించలేదు. ఇంకా 22 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
వీటిని మార్చి 31 లోగా పరిష్కరించాలని ప్రభుత్వం అధికారులకు గడువు విధించింది. దరఖాస్తుదారులు గడువులోగా పరిష్కరించుకుంటే 25 శాతం రాయితీ కల్పిస్తామని వెల్లడించింది. కానీ మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. లక్షలాది దరఖాస్తులను పరిష్కరించేందుకు ఎంత సమయం పడుతుంది? ఎంత సిబ్బంది అవసరం? అనే విషయాలను పట్టించుకోకుండా ఆగమేఘాలపై ప్రకటన ఎలా చేస్తారని ఉద్యోగ సంఘంలో ఓ కీలక నాయకుడు ప్రశ్నించారు.
రాష్ట్రంలోని ఎల్ఆర్ఎస్ కోసం దాఖలైన దరఖాస్తుల్లో కేవలం 10 శాతం కూడా అధికారులు పరిష్కరించలేదు. కొన్ని మున్సిపాలిటీలలో ఒక్కటంటే ఒక్కటి కూడా పరిష్కారం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం, పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజల్, బడంగ్పేట్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది పరిస్థితి. మరోవైపు రోజూ ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతున్నదని మున్సిపల్ అధికారులు వాపోతున్నారు. సిబ్బంది లేకుండా తాము మాత్రం ఏం చేయగలమని నిలదీస్తున్నారు. ప్రభుత్వం తమకు ఎన్ని డెడ్లైన్లు విధించినా, ప్రజలకు ఎన్ని రాయితీ ఆఫర్లు ప్రకటించినా సిబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించలేమని తేల్చిచెప్తున్నారు.
శాసనసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు 25 శాతం రాయితీ అంటూ మాట మార్చిందని రాజకీయవర్గాల్లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్ఆర్ఎస్ హామీని నమ్మి ఓటేసిన ప్రజలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొండి చేయి చూపించిందని పలువురు నేతలు మండిపడుతున్నారు. ఉచిత ఎల్ఆర్ఎస్ హామీ ఉత్తముచ్చటైందని ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేకుండా స్థానిక ఎన్నికల్లో లబ్ధికోసమే హడావుడి చేస్తున్నదని ఆరోపిస్తున్నారు.