Governor Tamilisai | గవర్నర్ తమిళిసై రాజీనామా.. తొలినుంచీ వివాదాస్పద నిర్ణయాలు
వివాదాల గవర్నర్‌గా పేరు సంపాదించుకున్న తమిళిసై సౌందర్‌రాజన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు తన రాజీనామా లేఖను పంపగానే ఆమె ఆమోదించారు. రాజ్యాంగబద్ధ పదవికి రాజీనామా చేసిన ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ అడుగిడబోతున్నారు.
- ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు
- ఫక్తు రాజకీయ నేతలా వ్యవహారం
- కేసీఆర్ ప్రభుత్వంపై అడుగడుగునా కక్ష
- ప్రొటోకాల్ పేరుతో నానా రాద్ధాంతం
- పార్టీపై, ప్రభుత్వంపై రాజకీయ వ్యాఖ్యలు
- ఎమ్మెల్సీలు, బిల్లుల ఆమోదానికి అడ్డుకట్ట
- తమిళనాడు నుంచి లోక్‌సభ బరిలోకి!
Governor Tamilisai | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): వివాదాల గవర్నర్‌గా పేరు సంపాదించుకున్న తమిళిసై సౌందర్‌రాజన్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు తన రాజీనామా లేఖను పంపగానే ఆమె ఆమోదించారు. రాజ్యాంగబద్ధ పదవికి రాజీనామా చేసిన ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ అడుగిడబోతున్నారు. తమిళనాడు నుంచి ఆమె బీజేపీ టికెట్‌పై లోక్‌సభకు పోటీచేయనున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
పార్టీ అధిష్ఠానం హామీతోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. 2019 సెప్టెంబర్ 8న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు. తొలుత రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించినప్పటికీ ఆ తర్వాత మాత్రం తనలోని బీజేపీ నాయకురాలిని బయటకు తీసినట్టు విమర్శలున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని రాజ్‌భవన్‌ను వివాదాలకు కేరాఫ్‌గా మార్చేశారన్న అపవాదు కూడా ఉంది.
బీఆర్ఎస్పై కక్షగట్టి అందుకు అనుగుణంగా పనిచేశారన్న ప్రచారం కూడా జరుగుతున్నది. ఆమె రాజీనామా తర్వాత సోషల్ మీడియాలోనూ సెటైర్లు పేలుతున్నాయి. ‘టాస్క్ కంప్లీటెడ్.. ఎగ్జిట్’ అని క్యాప్షన్లు తగిలిస్తూ.. అప్పగించిన పని పూర్తికావడంతో ఆమె వెళ్లిపోతున్నారన్న చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ను ఓడించే టార్గెట్‌ను ఆమెకు అప్పగించారని, పని పూర్తికావడంతో ఆమె తిరిగి వెళ్లిపోతున్నారన్న ప్రచారం ఊపందుకున్నది.
అందుకు అనుగుణంగానే ఆమె ప్రవర్తన ఉండేదని గుర్తుచేసుకుంటున్నారు. పలు సందర్భాల్లో ఆమె ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్యాబినెట్ ఆమోదం లేకుండానే ప్రసంగాలు చేశారు. ప్రొటోకాల్ పేరుతో పెద్ద రచ్చ చేశారు. చిన్న విషయాలను కూడా వివాదాస్పందంగా మార్చేశారన్న విమర్శలున్నాయి.
ప్రగతి నిరోధక చర్యలు
ప్రభుత్వ పంపిన బిల్లులకు, ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా పెండింగ్‌లో పెట్టడంతోపాటు కొన్నింటిని తిరస్కరించడం ద్వారా ప్రగతి నిరోధక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా తమిళిసైపై ఉన్నాయి. మరీ ముఖ్యంగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం విషయంలో ఆమె తన పరిధి దాటి వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి క్యాబినెట్, శాసనసభ ఆమోదంతో పంపిన 10 బిల్లులను నెలలపాటు పెండింగులో పెట్టారు.
గవర్నర్ తీరుతో చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సుప్రీం ఆదేశాలతో కొన్ని బిల్లులకు ఆమోదం తెలిపిన తమిళిసై మరికొన్ని బిల్లలను మాత్రం తిరస్కరించారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల విషయంలోనూ ఆమె కక్షపూరితంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. నాడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని క్యాబినెట్ నామినేట్ చేసి గవర్నర్‌కు పంపితే, రెండు నెలల వరకు ఆమోదం తెలుపకుండా పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత తిరస్కరించడంతో ఎమ్మెల్యే కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేయాల్సి వచ్చింది.
దాసోజు, కుర్రా విషయంలోనూ అంతే
బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ విషయంలోనూ గవర్నర్ ఇలానే రాజ్యంగ విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. గత సెప్టెంబర్‌లో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు ఫైలు పంపింది. దీనికి పలు కారణాలను సాకుగా చూపి తిరస్కరించారు. గవర్నర్ తీరుపై వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రిమండలి సిఫార్సులను తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని, ఫైలును పునఃపరిశీలించాలని గవర్నర్‌కు హైకోర్టు సూచించింది. కోర్టు సూచనలను పెడచెవిన పెట్టిన తమిళిసై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కాకుండా అడ్డుకున్నారు.
బీజేపీ నాయకురాలిలా
తమిళిసై తెలంగాణకు గవర్నర్‌గా రాకముందు వరకు బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. గవర్నర్ అయ్యాక కూడా ఆమె తన రాజకీయ అలవాట్లను మార్చుకోలేకపోయారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ బీజేపీ నాయకురాలిలా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె వ్యవహారశైలిపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు.
మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి!
గవర్నర్‌గా తన పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ తమిళనాడు నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి రాబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. చెన్నై సెంట్రల్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు సమాచారం. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవి చేపట్టిన తర్వాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గవర్నర్‌గా పనిచేశాక మళ్లీ ఎన్నికల్లో పోటీ నైతికత కాదని చెప్తున్నారు.
ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నా: తమిళిసై
గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. ప్రజాసేవ కోసం తిరిగి వెళ్తున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలపై తన ప్రేమ చిరస్థాయిగా ఉంటుందని, చిరస్మణీయమైన జ్ఞాపకాలతో తెలంగాణను వీడుతున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలోని సోదర సోదరీమణుల ఆప్యాయత తనను ఎంతగానో ఆకట్టుకున్నదని తెలిపారు.
ఏపీ గవర్నర్‌కు తెలంగాణ బాధ్యతలు!
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు కేంద్రం అప్పగించినట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో కొత్త గవర్నర్‌ను నియమించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

