హైదరాబాద్, నవంబర్1 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో ఏర్పడుతున్న ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ శుక్రవారం లేఖ రాశారు. పోలవరం ముంపు తదితర సాంకేతిక అంశాలపై గతంలో నిర్వహించిన సమావేశానికి సంబంధించి సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) రూపొందించిన మినట్స్‌ను ఆక్షేపించారు.
ఏపీ చెప్పని అభిప్రాయాలను కూడా చెప్పినట్లుగా సీడబ్ల్యూసీ పొందుపరిచిందని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో కేవలం రెండు చోట్ల మాత్రమే ముంపు వాటిల్లనుందని, ఆ చోట మాత్రమే డిమార్కేషన్ చేస్తామని ఏపీ చెప్పినట్టుగా మినట్స్‌లో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ సమావేశంలో ఏపీ అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేయలేదని తేల్చిపారేశారు. తెలంగాణలో అన్ని ముంపుప్రాంతాలను డిమార్కేషన్ చేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించిందని, ఏపీ కూడా అందుకు ముందుకు వచ్చిందని వివరించారు. ఇప్పటికైనా సమగ్ర సర్వేను పూర్తి చేసేలా పీపీఏను, ఏపీ ఆదేశించాలని కేంద్రజలశక్తిశాఖను కోరారు.