హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): పోలవరం నుంచి 80 టీఎంసీలను కేడీఎస్ (కృష్ణా డెల్టా సిస్టమ్)కు మళ్లించడం ద్వారా ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి కేటాయించిన 45 టీఎంసీలను ప్రస్తుత తెలంగాణకే కేటాయించాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు రాష్ట్రం తరఫున న్యాయవాది నివేదించారు. కేంద్రప్రభుత్వం జారీచేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం సైతం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ బుధవారం నాటి వాదనలను కొనసాగించారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఈ సందర్భంగా ఉటంకించారు. కృష్ణా నది నుంచి ఎకువ మొత్తంలో జలాలను ఏపీ వినియోగించుకుంటున్నదని, అది కూడా బేసిన్ అవతలికి మళ్లిస్తున్నదని మహారాష్ట్ర, కర్ణాటక తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయని గుర్తుచేశారు.
కృష్ణా లోటు బేసిన్ కాబట్టి గోదావరి నీటిని మళ్లించుకోవాలని ఆ రాష్ర్టాలు వాదించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గోదావరి ట్రిబ్యునల్ ఎదుట పోలవరం వివాద సమస్య పరిష్కారం కోసం ఉమ్మడి ఏపీ రాష్ట్రం 1978లో కర్ణాటక, మహారాష్ట్రలతో ఒప్పందం కుదుర్చుకున్నదని వివరించారు. పోలవరం నుంచి 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్లో మళ్లించాలని, తద్వారా అందులో 35 టీఎంసీల కృష్ణాజలాలను ఆ రెండు రాష్ర్టాలకు, మిగిలిన 45 టీఎంసీలను పూర్వ ఆంధ్రప్రదేశ్, అది కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎగువనే వినియోగించుకోవాలనే షరతు ఉందని వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఆ 45 టీఎంసీల కృష్ణా జలాలను తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రస్తుతం ఏపీ చేపట్టిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు, అందుకోసం ఏర్పాటు చేసిన జలహారతి కార్పొరేషన్ తదితర అంశాలను ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. నాగార్జునసాగర్ కుడి కాలువ, ఇతర ప్రాజెక్టుల కింద నీటి వినియోగాన్ని పోలవరం నుంచి మళ్లించనున్న నీటితో భర్తీ చేయనున్నారని తెలిపారు. ఏపీ చేపట్టిన చింతలపూడి, తాడిపూడి తదితర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల విస్తరణ అంశాలను కూడా ఉటంకించారు. కేడీఎస్ కాలువ నీటి వినియోగాన్ని లెకించాలని కోరారు.
ఏపీ వివిధ పథకాల ద్వారా గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించే అవకాశం ఉందని, తద్వారా ఆదా చేసిన కృష్ణా నీటిని బేసిన్ ప్రాంతాలకు కేటాయించాలని ట్రిబ్యునల్‌కు తెలంగాణ నివేదించింది. తదుపరి విచారణను మే 14, 15, 16వ తేదీలకు చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ వాయిదా వేశారు. సీనియర్ కౌన్సెల్ సీఎస్ వైద్యనాథన్, అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి, ఇతర న్యాయవాదులు, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఐఎస్డబ్ల్యూఆర్ యూనిట్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సల్లా విజయ్‌కుమార్, ఇతర ఇంజినీర్లు రవిశంకర్, వెంకటనారాయణ తెలంగాణ రాష్ట్రం తరపున విచారణకు హాజరుకాగా, ఏపీ నుంచి సీనియర్ కౌన్సెల్ జయదీప్ గుప్తా, ఉమాపతి, ఇతర న్యాయవాదులు, ఇంజినీర్లు హాజరయ్యారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 17 టీఎంసీల నీళ్లు కేటాయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. జూలై వరకు ఆ నీటి కేటాయింపులు చేయాలని బోర్డుకు ఈఎన్సీ అనిల్‌కుమార్ గురువారం లేఖ రాశారు. కృష్ణా బేసిన్లో జనాభాకు అనుగుణంగా 17 టీఎంసీలు అవసరమవుతాయని.. అయితే, ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో ఆవిరి నష్టాలు కాకుండా కేవలం 16 టీఎంసీల నీళ్లే ఉన్నాయని పేర్కొన్నారు. ఆ మొత్తం నీటిని తెలంగాణ అవసరాలకే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన కోటాను పూర్తిగా వాడుకున్నదని, ఇకపై ఆ రాష్ట్రం నీటిని తీసుకెళ్లకుండా అడ్డుకోవాలని కోరారు.