హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు సింగరేణి డైరెక్టర్లు మంగళవారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు. ఉదయమే విశాఖపట్టణం చేరుకున్న సింగరేణి డైరెక్టర్లు ఉక్కు కర్మాగారాన్ని పరిశీలించారు. స్టీల్‌ప్లాంట్ అధికారులతో సమావేశమై, సాంకేతిక, ఆర్థికపరమైన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. బుధవారం కూడా అక్కడే ఉండి మరికొంత అధ్యయనం చేయనున్నట్టు తెలుస్తున్నది. సింగరేణి డైరెక్టర్లు విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే నివేదికను సిద్ధం చేసి, గురువారం ఉదయం కల్లా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేయనున్నట్టు సమాచారం.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మూలధనాన్ని సమకూర్చడంతోపాటు ముడి సరుకులను సరఫరా చేసి, ఉక్కు ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) బిడ్ నోటిఫికేషన్‌ను గత నెల చివరి వారంలో స్టీల్‌ప్లాంట్ జారీచేసింది. ఆసక్తిగలవారు ఏప్రిల్ 15లోగా బిడ్ దాఖలు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి ఇప్పటికే మద్దతు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపరంగానూ అవకాశం ఉన్నంతమేరకు ఏపీ ప్రజలకు అండగా నిలవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ తరఫున బిడ్ దాఖలు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఏపీ ప్రజలకు మద్దతుగా నిలిచి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అవసరమైన ఉక్కును తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చుననే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే సింగరేణి డైరెక్టర్లు విశాఖ వెళ్లి, సాంకేతిక, ఆర్థిక అంశాలను అధ్యయనం చేస్తున్నారు. వీరు నివేదికను సమర్పించిన తరువాత సింగరేణి సంస్థ ద్వారా గానీ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా గానీ బిడ్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.