హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై తాము లేవనెత్తిన అంశాలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిగణనలోకి తీసుకోకుండా ఒంటెద్దు పోకడ పోవడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘మేం అడిగిందేమిటి.. మీరు చేసేదేమిటి?’ అంటూ బోర్డును ప్రశ్నించింది. ఇప్పటికే తెలంగాణ చేసిన సిఫారసుల మేరకు ఆర్డీఎస్‌పై అధ్యయనం చేయాలని డిమాండ్ చేసింది. కేఆర్ఎంబీకి రాష్ట్ర సాగు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం ఈ మేరకు లేఖ రాశారు. \
కేఆర్ఎంబీ తీరును తీవ్రంగా ఆక్షేపించారు. ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు 15.9 టీఎంసీలు రావాల్సి ఉన్నదని, వాస్తవంగా 5.53 టీఎంసీలు కూడా రావడం లేదని వివరించారు. ఎడమ కాలువలను, హెడ్‌వర్క్స్‌ను ఆధునికీకరించకపోవడం, ఏపీ తన నీటి వాటా 31.9 టీఎంసీలకు మించి కేసీ కెనాల్ ద్వారా 41.26 టీఎంసీలను అక్రమంగా వినియోగించుకోవడం ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని లేఖలో వెల్లడించారు. కర్ణాటక ప్రభుత్వం మిగిలిన ఆర్డీఎస్ పనులను కేసీ కెనాల్‌కు అక్రమంగా నీటిని తరలించుకుపోవాలనే ఉద్దేశంతో ఏపీ అడ్డుకొంటున్నదని విమర్శించారు. ఇప్పటికైనా ఆర్డీఎస్ ఆధునీకరణ పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.
గురు రాఘవేంద్ర ఎత్తపోతలను నిలిపేయాలి
ఏపీ ప్రభుత్వం 5.37 టీఎంసీల సామర్థ్యంతో కొత్తగా గురు రాఘవేంద్ర పేరిట ఆర్డీఎస్ నుంచి సుంకేశుల ఆనికట్ మధ్యన మొత్తంగా 13 ఎత్తిపోతల పథకాలను చేపట్టిందని కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌కు తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మరో లేఖను రాశారు.
ఆర్డీఎస్ ఆనికట్‌పై తెలంగాణ సర్కారు చేసిన ప్రతిపాదనలు
ఆర్డీఎస్ కాలువ మొత్తాన్ని ఒకే సామర్థ్యంతో విస్తరిస్తేనే తెలంగాణకు 15.9 టీఎంసీలు, కర్నాటకకు 1.2 టీఎంసీల వాటా నీరు అందుతుందని వివరించారు.
ఆర్డీఎస్ చివరి ఆయకట్టులోని 50 వేల ఎకరాలకు నీరందించాలంటే ఎత్తిపోతలు చేపట్టడం తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదు. ఆ ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్‌ను ఏర్పాటు చేసింది. ఆర్డీఎస్ నిర్మాణ లోపాలను సవరించేవరకూ అక్కడి నుంచే నిర్ణీత కేటాయింపుల మేరకు నీటిని వాడుకుంటాం.
హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు, తద్వారా తుంగభద్ర బేసిన్‌కు ఏపీ మళ్లించకుండా నిలువరించాలి.
1944 ఒప్పందం ప్రకారం కేసీ కెనాల్ ద్వారా 10 టీఎంసీలే వినియోగించుకునేలా ఏపీని నిలువరించాలని ట్రిబ్యునల్ 2 ఎదుట తెలంగాణ విజ్ఞప్తి చేస్తున్నది. ఈ అంశాలన్నింటినీ అధ్యయనంలో పరిగణలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ సూచించింది.