హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు అందజేసే యూనిఫాంల డిజైన్‌ను పాఠశాల విద్యాశాఖ మార్చింది. యూనిఫారాల రంగు మార్చకుండా కేవలం డిజైన్లను ఎంపిక చేసింది. కార్పొరేట్ బడుల దుస్తుల తరహాలో మార్పులు తెచ్చింది. ఈ మేరకు అబ్బాయిలు, అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లను విద్యాశాఖ ఖరారు చేసింది. నిష్ణాతులైన ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన కొన్ని కొత్త డిజైన్లను ఎంపిక చేసింది. ఆయా డిజైన్లను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఆయా డిజైన్ల ప్రకారమే యూనిఫాంలు కుట్టించాలని ఆదేశించారు. 2023-24 విద్యా సంవత్సరంలో రూ.140 కోట్లు వెచ్చించి రాష్ట్రంలోని 25 లక్షల మంది విద్యార్థులకు యూనిఫాంలు అందజేస్తారు. దీంట్లో కుట్టుకూలీతో పాటు వస్త్రం ఖరీదు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి తలా రెండు జతల యూనిఫాంలు ఇవ్వనుండగా, ఇందుకు సంబంధించిన వస్ర్తాన్ని టెస్కో ద్వారా సేకరిస్తున్నారు. మార్చి 2 నుంచి ఏప్రిల్ 30 వరకు దశల వారీగా వస్ర్తాన్ని సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను డీఈవోలకు పంపించిన అధికారులు, ఆయా మార్గదర్శకాల ప్రకారమే యూనిఫాంలను కుట్టించాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ బడులతోపాటు ఎయిడెడ్, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీలు, మాడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ఒకేలా దుస్తులు అందజేస్తారు. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌లో అంతర్భాగంగా వీటిని ఉచితంగా ఇస్తారు. అయితే 1-8 తరగతుల్లోని విద్యార్థులకు మాత్రమే కేంద్రం 60 శాతం నిధులను వాటాగా ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం వాటాను సమకూరుస్తున్నది. ఇక 9, 10, 11, 12 తరగతుల్లోని విద్యార్థులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే యూనిఫాంలు కుట్టిస్తున్నది. కేంద్రం నుంచి రూపాయి రాకున్నా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా యూనిఫాంలను అందజేస్తుండటం విశేషం. ఇది వరకు వస్ర్తాన్ని పాఠశాలలకు అందజేసి హెచ్ఎంలతో కుట్టించే వారు. దీంతో ఒక్కో చోట ఒక్కో డిజైన్‌లో యూనిఫాంలుండేవి. ఇప్పుడు రాష్ట్రమంతా ఒకే డిజైన్‌లో యూనిఫాంలు ఉండనున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు పాఠశాలల పునః ప్రారంభ సమయంలోనే యూనిఫాంలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు పలు డిజైన్లను పరిశీలించి ఖరారు చేశాం. యూనిఫాంలకు కొత్త రూపునిచ్చాం. విద్యార్థులు యూనిఫాంలను ధరించి తరగతులకు హాజరైతే వారిలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. విద్యార్థులంతా ఒకే రకమైన దుస్తులు ధరించడంతో వారి మధ్య తారతమ్యాలు, ఎలాంటి కల్మషాలకు తావుండదు.
– విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి