హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి (Indiramma Indlu) తక్కువ స్థలం ఉన్నవారు జీ+1 మోడల్లో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం అనుమతించినప్పటికీ పట్టణ మురికివాడల్లో నివసించే వారికి దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతున్నది. నిబంధనల ప్రకారం ఇంటి పట్టా లేదా సేల్డీడ్ ఉంటేనే ఇల్లు మంజూరవుతుంది. కానీ పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో పట్టాలు లేదా సేల్డీడ్లు ఉండే అవకాశాలు లేవు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు సంబంధంచి ఇప్పటివరకూ పట్టణ ప్రాంతాల వారికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేయలేదు. కానీ తాజాగా ప్లాట్ సైజు 45 గజాలలోపు ఉన్నప్పటికీ జీ+1 పద్ధతిలో నిర్ణీత వైశాల్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతించింది. దీంతో ఇంటి పట్టాలు ఉన్నవారికి కొంత ఊరట లభించినప్పటికీ పట్టణాల్లోని మురికివాడల్లో ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా గుడిసెలు నిర్మించుకొని జీవిస్తున్న నిజమైన లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండాపోయింది. పట్టణ మురికివాడలు ఎక్కువగా ప్రభుత్వ, సీలింగ్ భూముల్లో ఉన్నాయి. వీటిలో అత్యధిక నివాసాలు 50-60 గజాలలోపు స్థలాల్లోనే ఉన్నాయి.
వారికి ఇంతవరకు ఎటువంటి యాజమాన్య హక్కులు లభించలేదు. చాలామంది తమపేర కరెంటు, నల్లా కనెక్షన్లు తీసుకోగా, మరికొందరు తమ ఆధీనంలోని స్థలాలను నోటరీలపై ఇతరులకు విక్రయించారు. దీంతో మురికివాడల్లోనివారికి నోటరీలు, కరెంటు బిల్లులు తప్ప ఇతర యాజమాన్య హక్కులు సూచించే ఆధారాలేవీ లేవు. గ్రేటర్ హైదరాబాద్ సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో లక్షల సంఖ్యలో ప్రజలు ఇటువంటి మురికివాడల్లో నివసిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రయోజనం పొందాలంటే వారికి యాజమాన్య హక్కు పత్రాలు తప్పనిసరి. అవి లేకుండా ఇల్లు మంజూరయ్యే అవకాశంలేదు.
తాము అనేక దశాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ తమ ఇండ్లకు సేల్డీడ్లు లేవని, ఇతరుల వద్ద నోటరీపై కొనుగోలు చేశామని హైదరాబాద్ నాగమయ్యకుంటకు చెందిన రాజయ్య తెలిపారు. దశాబ్దాల క్రితం ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నవారు ఇప్పుడు ఎవరూ లేరని, కాలక్రమంలో వారంతా నోటరీలపై ఇతరులకు అమ్ముకొని వెళ్లిపోయారని చెప్పారు. ప్రస్తుతం మురికివాడల్లో నివసిస్తున్నవారిలో ఎక్కువశాతం మంది ఆక్రమణదారుల నుంచి స్థలాలు కొనుగోలు చేసినవారేనని పేర్కొన్నారు. తమవద్ద నోటరీలు, కరెంటు బిల్లులు ఉన్నాయని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరీకి వీటిని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. ఒకవేళ ఇంటి పట్టాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే, మురికివాడల్లో నివశించే నిజమైన లబ్దిదారులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రాజయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలన్నింటిలో దాదాపు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.