హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్‌లోని కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, కోకాపేట సర్వే నంబర్ 239, 240లోని భూములు ప్రభుత్వానివేనని సీఎస్ సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ఈ భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఏజెంట్‌గా వ్యవహరించిందని బుధవారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వేలంలో ఈ భూములను కొన్న బిడ్డర్లకు రిజిస్ట్రేషన్లు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం అభివృద్ధి చేసిన కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లో ప్లాట్లు హట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 50 ఎకరాల విస్తీర్ణం కలిగిన 8 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించారు. ఎకరానికి రూ.25 కోట్ల కనీస ధరను నిర్ణయించగా.. బిడ్డర్లు తీవ్రంగా పోటీపడి కనిష్ఠంగా రూ.31.2 కోట్లు, గరిష్ఠంగా రూ. 60.2 కోట్లకు దక్కించుకొన్నారు. ఈ వేలంలో వచ్చిన మొత్తం సొమ్మును హెచ్ఎండీఏ ప్రభుత్వ ట్రెజరీలోనే జమచేసిందని సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. నియోపోలిస్ లేఅవుట్లో కొనుగోలు చేసిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తోపాటు హెచ్ఎండీఏ అధికారులు పూర్తిచేస్తారని సీఎస్ తెలిపారు.