హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) అమలుచేయని ప్రైవేట్ దవాఖానలపై సర్కార్ కరెంట్, వాటర్ కట్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఈహెచ్ఎస్ స్కీమ్‌ను జూలై 17న ప్రారంభించగా, సరిగా అమలుకావడం లేదని, 10శాతం కూడా అమలుచేయడం లేదని ఎంప్లాయీస్ జేఏసీ ఆరోపించిన విషయం తెలిసిందే. దవాఖానలు అనుసరిస్తున్న వైఖరితోనే ఈ స్కీమ్ సక్రమంగా అమలుకావడం లేదన్న భావనలో సర్కార్ వర్గాలున్నట్టు తెలుస్తున్నది.
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌ను అమలుచేస్తున్నట్టుగా ఈహెచ్ఎస్ను అమలుచేయకపోవడంతో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఎంతమంది రోగులకు ప్రైవేట్ దవాఖానలు ఉచిత వైద్యమందించాయి, ప్రభుత్వ స్థలాలు పొందిన దవాఖానలు ప్రజా సంక్షేమ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్న విషయాలపై ఓ నివేదిక కోరనున్నట్టు తెలిసింది.
ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) అమల్లో రాజీపడొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ పథకాన్ని ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఆదివారం ప్రజాభవన్‌లో సీఎస్ సంజయ్‌జాజు సహా ట్రస్టుబోర్డు సభ్యులతో సమీక్ష నిర్వహించారు. పథకం అమల్లో సమన్వయం లోపంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కీమ్ అమల్లో అధికారులే కాకుండా.. ఉద్యోగ సంఘాల నేతలు సైతం తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని సూచించారు.