హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. హైకోర్టు టీచర్ల బదిలీలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 3తో ముగియనుంది. మొదట క్యాటగిరీలు, మేనేజ్మెంట్ల వారీగా పదోన్నతులు కల్పిస్తారు. ఆ తరువాత పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీల్లో బదిలీలు చేపట్టి పోస్టింగ్స్ఇస్తారు. దీంతో ఏకమొత్తంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగుస్తుంది. ఈ నెల 3 నుంచి 5 వరకు దరఖాస్తులు అందించేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 5 నుంచి 19 వరకు అప్పీళ్లను స్వీకరిస్తారు. ఈ అప్పీళ్లను 15 రోజుల్లో పరిష్కరించేలా షెడ్యూల్‌ను రూపొందించారు.
ఇటీవల టీచర్ల బదిలీలపై స్టేను తొలగించిన హైకోర్టు.. స్పౌజ్ పాయింట్లను యథాతథంగా కొనసాగించి, ఉపాధ్యాయ సంఘాలకు కేటాయించిన ప్రిఫరెన్షియల్ పాయింట్లను హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్‌పై కసరత్తు చేసిన అధికారులు షెడ్యూల్‌ను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి టీచర్లు 8 సంవత్సరాలు, హెచ్ఎంలు 5 సంవత్సరాల సర్వీసు పూర్తిచేసుకుంటే బదిలీకి అర్హులు. ఇక పదవీ విరమణకు మూడేండ్ల లోపు సర్వీసు ఉన్న టీచర్లు, హెచ్ఎంలు బదిలీ నుంచి మినహాయింపు పొందవచ్చు. గతంలో స్పౌజ్ బదిలీ పాయింట్లను యాడ్ చేయనివారు ఇప్పుడు కొత్తగా ఈ పాయింట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ..