Caste Census | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక బడులను సగంపూటే నడపనున్నది. అది ఒక్క రోజు.. రెండు రోజులు కాదు ఏకంగా మూడు వారాలు. ఇప్పటికే సర్కారు స్కూళ్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లుతుండగా, స్కూళ్లను పూర్తిగా అంపశయ్యపైకి చేర్చనున్నది. ఇదంతా ఏదో అత్యవసర పనుల కోసమో..? రాష్ట్రం దశ, దిశను మార్చేందుకో అనుకుంటే పొరపాటు పడ్డట్టే.
రాజకీయపరంగా తమకు లబ్ధిచేకూర్చే కులగణన సర్వే కోసం. ఈ నెల 6 నుంచి రాష్ట్రంలో మూడు వారాలపాటు సమగ్ర ఆర్థిక సర్వేను నిర్వహించనున్నారు. దీంతో రాష్ట్రంలోని 1-5 తరగతుల్లోని 10లక్షల మంది చదువులు ఆగంకానున్నాయి. సర్వే కోసం సెండరీ గ్రేడ్ టీచర్లు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎంల సేవలను వినియోగించుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 18,241 ప్రాథమిక పాఠశాలలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడపాలని సర్కారు ఆదేశించింది.
అయితే ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్ టీచర్లకు(ఎస్జీటీ) మాత్రం సర్వే నుంచి మినహాయింపు ఇచ్చింది. సెలవురోజుల్లో సిబ్బంది మొత్తం రోజంతా సర్వే చేపట్టాలని సూచించింది. విద్యాశాఖ తీరును పలు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తక్షణమే ఆయా ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభమైనా జూలై వరకు అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫారాల పంపిణీతోనే గడిచిపోయింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులతోనూ బోధనకు ఆటంకమేర్పడింది. ఆ తర్వాత టీచర్ల సర్దుబాటు చేపట్టారు. ఇక కొత్త టీచర్లకు పోస్టింగ్స్ ఇచ్చి గతంలో బదిలీ అయిన వారిని రిలీవ్ చేశారు. ఇక దసరా, దీపావళి సెలవులు, పరీక్షలతో అక్టోబర్ గడిచిపోయింది. నవంబర్‌లో చదువులు గాడినపడతాయనుకోగా కుల గణన సర్వే వచ్చిపడింది.
సర్వే కోసం ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, టీచర్లను ప్రభుత్వం వినియోగించనున్నది. సంఖ్యపరంగా చూస్తే 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, 3,414 ప్రాథమిక పాఠశాల హెచ్ఎంలు, 6,256 మంది మండల రీసోర్స్ సెంటర్ల సిబ్బంది, మరో 2వేల మంది పాఠశాలల్లో పనిచేస్తున్న టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నారు. మొత్తం 80 వేల మందిలో సగం మంది సర్కారు టీచర్లే ఉన్నారు. అయితే ఈ ఉత్తర్వుల వెనుక ఏదో మతలబు దాగి ఉందని ఉపాధ్యాయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం బడిలో విధుల్లో పాల్గొని, మధ్యాహ్నం కులగణన సర్వే చేయడం అసాధ్యమని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ తేల్చిచెప్పింది. ఉపాధ్యాయ సంఘాలతో డిప్యూటీ సీఎం నిర్వహించిన సమావేశంలో తాము చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేయడంపై ఒక ప్రకటనలో అభ్యంతరం వ్యక్తంచేసింది. వ్యవసాయ పనులు సాగుతున్న ప్రస్తుత తరుణంలో పిల్లలను మధ్యాహ్నమే వదిలిపెడితే తల్లిదండ్రులు అంగీకరించబోరని సంఘం నేతలు పేర్కొన్నారు.
కుల గణన సర్వే విధులు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకే కేటాయించడాన్ని తాము ఖండిస్తున్నట్టు టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల టీచర్లకు సైతం సర్వే విధు లు కేటాయించాలని కోరారు. కానీ స్కూళ్లను సగంపూట మూసివేయడం సరికాదని వాపోయారు. తప్పుడు నిర్ణయాలతో నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కుల గణన పేరుతో ప్రాథమిక పాఠశాల టీచర్లను విద్యాబోధనకు దూరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీ ఎస్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రాథమిక తరగతుల్లోని విద్యార్థులకు అన్యాయం చేయడం, వివక్ష చూపడమే అవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
స్కూళ్లను మూసివేయకుండా పూర్తిస్థాయిలో నడపాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇద్దరు టీచర్లుంటే విడతలవారీగా గణన బాధ్యతలప్పగించాలని సూచించారు. దీంతో స్కూళ్లు సజావుగా నడిపే వీలుంటుందని పేర్కొన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాల టీచర్లకు సర్వే విధులు కేటాయించొద్దని కోరారు.