హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దసరాకు ముందే సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు సంస్థ లాభాలను తేల్చి, 33 శాతం బోనస్‌ను ప్రకటించింది. శుక్రవారం సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌ను ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి లాభం రూ.4,701 కోట్లుగా ప్రకటించారు. దాంట్లో రూ.2,283 కోట్లను మినహాయించి, రూ.2,412 కోట్లలోనే 33 శాతం లాభాల బోసన్‌ను ప్రకటించారు. రూ.2,289 కోట్లను సంస్థ వ్యాపార విస్తరణ ప్రణాళికల కోసం పక్కన పెట్టినట్టుగా ప్రకటించారు.
33 శాతం వాటా కింద రూ.796 కోట్లను లాభాల వాటాగా చెల్లిస్తామని వారు ప్రకటించారు. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1.90 లక్షలు, కాంట్రాక్ట్ కార్మికులకు 5 వేల చొప్పున బోనస్‌గా అందజేస్తామని చెప్పారు. నిరుడితో పోల్చితే ఈ ఏడాది రూ.20 వేలు అదనంగా అందిస్తున్నామని తెలిపారు. దీంతో 41,837 మంది రెగ్యులర్ కార్మికులు, 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు లబ్ధిచేకూరుతుందని వెల్లడించారు.
సింగరేణి సంస్థ ఆర్జించిన రూ.2,283 కోట్ల లాభాన్ని వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులుగా పెడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, రామగుండంలో 500 మోగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్, జైపూర్‌లో 800 మోగావాట్ల మూడో యూనిట్, టీజీజెన్కో భాగస్వామ్యంతో 800 మోగావాట్ల ప్లాంట్, నైనీ బొగ్గు బ్లాక్ సమీపంలో పవర్‌ప్లాంట్‌ను నెలకొల్పుతున్నామని తెలిపారు.
సింగరేణి పరిధిలో దవాఖానలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, క్యాథ్‌ల్యాబ్‌లు, క్యాంటీన్ల ఆదునీకీరణ, హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వీకే, గోలేటి, నైనీ ఓపెన్ కాస్ట్లను ఈ ఏడాదే ప్రారంభిస్తామని ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం సహా పలువురు ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.