BRS MLC Kavitha | ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను ఆరు నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన బిడ్డలకు విద్యా ఉపాధి రంగాల్లో అదనపు అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. నిజామాబాద్లో బంజారా భవనం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపామని చెప్పారు. అయినా కూడా తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదన్నది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎనిమిదేండ్లు వేచి చూసిన తర్వాత ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తద్వారా గిరిజనులకు విద్యలో, ఉపాధిలో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. రిజర్వేషన్ పెంచిన తర్వాత దాదాపు 3,985 మంది గిరిజన బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని, 195 మందికి మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు లభించాయని వివరించారు. సమాజ హితం కోసమేసీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారని, రాజకీయం కోసం కాదన్నది ఈ లెక్కలు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు. నిర్ణయం వల్ల గిరిజనుల తరతరాల్లో మార్పు వస్తుందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించే నిధులను గత ప్రభుత్వాలు ఇతర అవసరాల కోసం మళ్లించేవని అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కానీ గత పదేండ్లలో ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ. 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. పోడుపట్టాలు, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రియింబర్స్ మెంట్ వంటి పలు ప్రయోజనాలు గిరిజనులకు లభిస్తున్నాయన్నారు. 178 మోడల్ పాఠశాలలను నిర్మించామని, అన్నింటికీ జూనియర్ కాలేజీలుగా విస్తరిస్తున్నామని చెప్పారు.
60 ఏండ్ల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ 90 పాఠశాలలను ఏర్పాటు చేస్తే, తొమ్మిదేండ్లుగా తెలంగాణను పరిపాలిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం190 పాఠశాలలను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంటల కవిత తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ప్రతీ జిల్లా కేంద్రంలో హాస్టల్ తో కూడిన డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. సమ్మక్క సారక్క మేడారం జాతరకు ఇప్పటి వరకు రూ. 400 కోట్లు ఇచ్చామని, ప్రతీ తండాకు రోడ్డు వేశామన్నారు. 3200పైగా తండాలను గ్రామ పంచాయతీ హోదా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. బంజారాల కోసం సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎన్నో పనులు చేసిందని, ఎన్ని పనులు చేసినా కూడా రాష్ట్రంలో 10 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే అది కేవలం గిరిపత్రుల వల్లనే వచ్చిందని తాను ఎప్పడూ చెబుతుంటానని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వరంగల్ ప్రాంతంలో ఓ తండాలో నిద్రించిన క్రమంలో అక్కడే ఇళ్లు దగ్దమయ్యి బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న డబ్బు పోవడంతో వారు సీఎం కేసీఆర్ ను ఆశ్రయించి రూ. 50 వేలు ఇస్తే బిడ్డ పెళ్లి చేస్తామని వారు అన్నారని, ఆ మాట గుర్తుంచుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేశారని వివరించారు. బంజారా భవనం నిర్మాణానికి సహకరించిన మంత్రి సత్యవతి రాథోడ్ కు ధన్యవాదాలు తెలిపారు.