పాల్వంచ, ఏప్రిల్ 16 : తెలంగాణ ప్రభుత్వం కార్మికులపైనా బెదిరింపులకు దిగింది. ‘విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం (డీమ్డ్ టర్మినేషన్)’ అంటూ జెన్కో యాజమాన్యం ద్వారా అనధికారిక ఉత్తర్వులతో ఒత్తిడి చేసింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కార్మికులు సమ్మె విరమించారు. ఏపీఎస్సీబీ రూల్స్, ఎన్నికల హామీ ప్రకారం తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్తురంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగిన విషయం విదితమే. టీవీఏఈ జాక్ పిలుపు మేరకు పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో ఈ నెల 8న ప్రారంభమైన సమ్మె గురువారం 9వ రోజుకు చేరుకున్నది.
సమ్మె ఉధృతంగా కొనసాగడంతో ప్రభుత్వ ఒత్తిడి మేరకు టీజీ జెన్కో యాజమాన్యం కఠిన చర్యలకు పూనుకున్నది. జెన్కోలో సమ్మె చేస్తున్న కార్మికులందరూ విధుల్లో చేరకపోతే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ అనధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేటీపీఎస్ ప్రాంగణంలో 5, 6 దశల్లో 1,362, కేటీపీఎస్ ఏడో దశ, ఓఅండ్ఎం, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పనిచేస్తున్న 729 మంది ఆర్టిజన్లు భయాందోళనకు గురయ్యారు. అప్పటి వరకూ సమ్మె శిబిరంలో ఉన్న 200 మంది కార్మికులు విధుల్లో చేరారు.
కేటీపీఎస్ 5, 6 దశల్లో పనిచేసే ఆర్టిజన్లందరూ సమ్మె విరమించి విధుల్లో చేరారని సీఈ ప్రభాకర్‌రావు తెలిపారు. కార్మికులందరూ క్రమం తప్పకుండా విధులకు హాజరుకావాలని సూచించారు. 7వ దశలోని 720 మంది ఆర్టిజన్లను కూడా విధుల్లో చేర్చుకుంటున్నామని ఏడో దశ సీఈ సూర్యనారాయణ వెల్లడించారు.