హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ మాటతప్పారు.. మడమ తిప్పేశారు.. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్‌షోల అనుమతి విషయంలో రేవంత్‌రెడ్డి తీరు వివాదాస్పదమవుతున్నది. అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు లేవని ఢాంబికాలు పలికిన ముఖ్యమంత్రి.. ఏపీకి చెందిన కొందరు ముఖ్యనేతల ఆదేశాలతో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు ప్రత్యేకంగా ‘పెయిడ్ ప్రీమియర్ షో’ పేరిట అభిమానుల జేబులు గుల్ల చేసేందుకు అనుమతులు ఇచ్చారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి రెండు నాల్కల ధోరణిని నెటిజన్లు సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. పుష్ప బెనిఫిట్ షో తొక్కిసలాట తర్వాత అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ప్రస్తుతం హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం మాటలను ఒకచోట పెట్టి వైరల్ చేస్తున్నారు. నాడు ఎలాంటి బెనిఫిట్ షోలు ఉండవని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు పెయిడ్ ప్రీమియర్ షోకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా బెనిఫిట్ షో వంటిది కాదా? అని నిలదీస్తున్నారు. సినిమా విడుదలకు ముందురోజు (23న) రాత్రి 9 గంటలకు థియేటర్లలో వేసే ఈ షోకు జీఎస్టీతో కలిపి సుమారు రూ.650 వసూలు చేసేందుకు నిర్ణయించారని మండిపడుతున్నారు.
ఏపీ ముఖ్యనేత నిర్ణయాలను అమలు చేస్తున్నారనే అపవాదును సీఎం ఎదుర్కొంటున్న నేపథ్యలో తాజా నిర్ణయంతో అవుననే అనిపిస్తున్నది. ఈ విషయంలో ఏపీ ముఖ్యనేతకు, తెలంగాణ సీఎంకు సన్నిహితుడైన రోహిణ్‌రెడ్డి అనే విషయం బయటకొచ్చింది. తెలంగాణలో తమ సినిమా రేట్లు పెంచడానికి పైస్థాయిలో లాబీయింగ్ చేసింది రోహిణ్‌రెడ్డి అంటూ హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం తాజాగా వేదిక మీదనే ప్రకటించారు. రోహిణ్‌రెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్‌గా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నారు. పైగా ఏపీ ముఖ్యనేతలకు కూడా సన్నిహితుడనే ప్రచారం ఉన్నది.